
భారతదేశం జీ20 సదస్సుకు అధ్యక్షత వహించినందున.. వచ్చే ఏడాది దేశంలో జరగనున్న సమావేశాలకు సంబంధించిన ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సన్నాహక సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులను కేంద్రం ఆహ్వానించింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానిస్తూ కేంద్రం నుంచి బుధవారం పార్టీకి ఆహ్వానం అందిందని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి తాను హాజరు కాకపోయిన.. టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరినైనా పంపిస్తారా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఇంతకుముందు ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల గురించి చర్చించడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా కేంద్రం.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ఈ సమాశానికి కేంద్రం నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ.. కేసీఆర్ గైర్హాజరయ్యారు.
Also Read: మోదీ సమావేశం కోసం ఢిల్లీకి సీఎం జగన్.. అదే మీటింగ్‌కు చంద్రబాబు కూడా.. ఆసక్తికరంగా పరిణామాలు..
ఇక, సీఎం కేసీఆర్ చివరిసారిగా ప్రధాని మోదీని గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన ఢిల్లీలో కలిశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య రాజకీయ పోటీ పెరిగింది. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఈ పోటీ తారాస్థాయికి చేరింది. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దేశంలో పలు ప్రధాన పార్టీలకు చెందిన నేతలతో ఆయన చర్చలు జరిపారు. మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో వాటికి కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏడాది కాలంలోనే ప్రధాని మోదీ నాలుగు సార్లు తెలంగాణకు రాగా.. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికే బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది అక్టోబర్ జాతీయ రాజకీయాల్లో వెళ్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించిన కేసీఆర్.. తన పార్టీ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేందుకు తీర్మానాన్ని కూడా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆమోదింపజేశారు. అనంతరం టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘానికి కూడా అందజేశారు. మరోవైపు డిసెంబర్ నెలలో కేసీఆర్.. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణ, ప్రణాళికలను ప్రకటిస్తారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, రాష్ట్రంలో ఓ వైపు ఐటీ, ఈడీ దాడులు.. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. మునుగోడు ఉపఎన్నిక తర్వాత ఇది మరింతగా ముదిరింది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా అనుసరిస్తున్న వైఖరి మాదిరిగానే.. డిసెంబర్ 5వ తేదీన కూడా మోదీ నేతృత్వంలో జరిగే సమావేశానికి దూరంగా ఉండాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.