ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికే కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ పదవిని కట్టబెట్టిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక వెనుక రాజకీయ కారణాలు వున్నాయని ఆయన ఆరోపించారు.
కొత్తగా కొలువుదీరిన తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ నేతల విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. తొలి రోజు నుంచే దీనిపై బీజేపీ రగిలిపోతూ వుండగా.. ఏకంగా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నే బహిష్కరించింది. స్పీకర్ సీట్లో అక్బరుద్దీన్ వుండగా తాము ప్రమాణం చేసేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చిచెప్పారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికే కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ పదవిని కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేని నియమిస్తారని, కానీ ఈ విషయంలో సీనియారిటీని కాంగ్రెస్ పట్టించుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక వెనుక రాజకీయ కారణాలు వున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎవరి పేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని లక్ష్మణ్ తెలిపారు.
Also Read: రేవంత్ రెడ్డి సర్కారుపై బీజేపీ ఫైర్.. ప్రొటెం స్పీకర్ నియామకంపై గవర్నర్‌కు లేఖ
అంతకుముందు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది. ఏఐఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన ఏడుగురు ఎన్నికైన ఎమ్మెల్యేలు గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.
కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల ముసుగులో కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కూడా బీజేపీ ఆరోపించారు. ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు మూడవ శాసనసభ సమావేశాల మొదటి సెషన్‌ను బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించిన ప్రక్రియలు, ప్రోటోకాల్‌లు, పూర్వాపరాలను నిర్మొహమాటంగా ఉల్లంఘించారని ఆరోపించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 188 ప్రకారం అసెంబ్లీలో ఏళ్ల సంఖ్య పరంగా అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నామినేట్ చేయాలి. అక్బరుద్దీన్ ఒవైసీ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను ప్రొటెం స్పీకర్ గా నియమించిందనీ, ఇది నిర్దేశిత నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ లేఖలో ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందనీ, దీనిని రద్దు చేయాలని ఎమ్మెల్యేలు గవర్నర్ ను కోరారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అత్యంత సీనియర్లను నియమించేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.