Bandi Sanjay: 'ఆ చేపల పులుసే తెలంగాణ ప్రజల కొంప ముంచింది' 

By Rajesh Karampoori  |  First Published Oct 14, 2023, 11:33 PM IST

Bandi Sanjay: సీఎం కేసీఆర్ తీరును బీజేపీ నేత బండి సంజయ్  దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలోనే ప్రజలు చేశారని, దక్షిణ తెలంగాణను ముంచారని ఆయన ఆరోపించారు. చేపల పులుసే కొంప ముంచిందని.. ఆ పులుసు తిని‌ తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేశారని ఎద్దేవా చేశారు. 


Bandi Sanjay: చేపల పులుసు తెలంగాణ ప్రజల కొంప ముంచింది అంటూ  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ రైతు సదస్సులో భాగంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆయన చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటూ.. సీఎం కేసీఆర్ తీరును దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలోనే ప్రజలు చేశారని.. దక్షిణ తెలంగాణను ముంచారని ఆయన ఆరోపించారు. విభజన సమయంలో కేసీఆర్ కమీషన్లకు లాలూచీ పడ్డారని విమర్శించారు. 

చేపల పులుసే కొంప ముంచిందని.. ఆ పులుసు తిని‌ 570 టీఎంసీలకు బదులు 292 టీఎంసీలకు సంతకం చేశారని,  తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేశారని సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత 9 ఏళ్లు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాశారని బండి సంజయ్ చురకలంటించారు. కేంద్రం ఎలాంటి ఆన్సర్ ఇచ్చింది అన్నది మాత్రం కేసీఆర్ చెప్పలేదని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే దానికి హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Latest Videos

undefined

కేంద్రం ధాన్యాన్ని రూ.2030కి కొనడానికి సిద్ధంగా ఉంటే.. కేసీఆర్ రూ. 1700కి ఎలా నిర్ణయిస్తారని సంజయ్ ప్రశ్నించారు. దీని వల్ల రూ.500 నుంచి రూ.700 కోట్లు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. పదవీ విరమణ చేసిన అధికారులను సీఎంవోకు తీసుకొచ్చి ప్రజలు ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నారని సంజయ్ దుయ్యబట్టారు. వేసవి రాకముందే శ్రీరాంసాగర్‌లో ఒక్క చుక్క నీరు లేదని, రేపు,ఎల్లుండి కేసీఆర్ బయటకు వచ్చి రైతుబంధు, ఫ్రీ యూరియా అని అబద్దపు వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో రైతు బంధు ఇవ్వరని.. ఆపేయమని చెబుతారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రైతులు తలచుకుంటే బీఆర్ఎస్‌ను గద్దె దించవచ్చని, ఓటు వేసే ముందు ప్రజలకు కేసీఆర్ తిన్న చేపల పులుసు గుర్తుకు రావాలన్నారు. 

ప్రవళిక ఆత్మహత్యపై  విచారం 

ఇక గ్రూప్ 2 విద్యార్ధిని ప్రవళిక ఆత్మహత్యపై బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు వాయిదా పడుతున్నాయని, మీరు తన కోసం ఎంతో కష్టపడ్డారని బాధపడిందని సంజయ్ తెలిపారు. ప్రవళిక మృతికి నిరసనగా యువత మొత్తం వచ్చారని, లక్ష్మణ్, భాను ప్రకాష్ వాస్తవాలను తెలుసుకునేందుకు అక్కడికి వెళ్తే వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో విద్యార్ధులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించరు గానీ, ఎక్కడో పంజాబ్ లో మాత్రం లక్షలాది రూపాయాలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. 

ఆమె కుటుంబంలో మనోధైర్యం నింపాల్సిందిపోయి లవ్ ఫెయిల్యూర్ అని చెబుతున్నారని, ఆ అమ్మాయి చావుతో కూడా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు తాము అండగా వుంటామని, కోచింగ్ సెంటర్లు మూసేసి గ్రామాలకు వెళ్లాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 50 రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించి బీజేపీకి ఓటు వేసేలా చూడాలని ఆయన కోరారు. ఉద్యోగులు, విద్యార్ధులు తలచుకుంటే కేసీఆర్ ను గద్దెదించడం పెద్ద విషయమేమి కాదన్నారు. నవంబర్ 30 కేసీఆర్‌కు డెడ్ లైన్ కావాలని.. ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బండి సంజయ్ ఆరోపించారు.

click me!