గ్రూప్ 2 విద్యార్ధిని ప్రవల్లిక ఆత్మహత్యపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తన ఆత్మహత్యకు కారణాలపై ఆమె సూసైడ్ నోట్‌లో స్పష్టంగా తెలియజేసిందని.. కానీ పోలీసులు ఆమెపై అబాండాలు వేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.
నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఉండకూడదంటే కేసీఆర్ గద్దె దిగాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. భావోద్వేగంతో యువత ప్రాణాలు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. డిసెంబర్ 9 నుంచి వారి జీవితాల్లో వెలుగులు తెస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలలు ఓపిక పట్టాలని రేవంత్ రెడ్డి యువతను కోరారు.
గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల రద్దుతో రాష్ట్రంలో అనేకమంది యువత ఆత్యహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు విక్రయించడమంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సింగరేణి నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని.. జరిగిన పరిణామాలకు టీఎస్‌పీఎస్సీ అధికారులను బాధ్యులను చేయడం లేదని ఆయన మండిపడ్డారు.
ALso Read: మోసం చేయడంతో మనస్తాపం.. ప్రేమ వ్యవహారంతోనే ప్రవళిక ఆత్మహత్య, చాటింగ్‌తో నిర్దారణ: పోలీసులు
విద్యార్ధిని ప్రవల్లిక ఆత్యహత్యపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. పోటీ పరీక్షలు రాసే విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడితే మరో విధంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చనిపోయిన విద్యార్ధినిపై అబాండాలు వేయడం సరికాదన్నారు. ప్రవల్లిక రాసిన లేఖలోనే ఆత్మహత్యకు కారణాలను స్పష్టంగా పేర్కొందని.. విద్యార్ధులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.