ఓఆర్ఆర్ ను తెలంగాణ ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు కట్టబెట్టారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కంపెనీ దాఖలు చేసిన బిడ్ ను ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్:కవిత, కేటీఆర్ స్నేహితుల కంపెనీకి ఓఆర్ఆర్ ను లీజుకు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మంగళవారంనాడు హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఓఆర్ఆర్ కాంట్రాక్టు బిడ్ ను ఈ ఏడాది ఏప్రిల్ 11న తెరిచినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ ఏప్రిల్ 27న ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు ప్రకటన విడుదల చేశారని రఘునందన్ రావు గుర్తు చేశారు. బిడ్ ఓపెన్ చేసిన 16 రోజుల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టారని రఘునందన్ రావు ప్రశ్నించారు. అంతేకాదు కంపెనీ దాఖలు చేసిన బిడ్ కంటే ఈ 16 రోజుల్లో బిడ్ అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. దీని వెనుకే ఏదో మతలబు జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న కంపెనీ రూ.7272 కోట్లు కోట్ చేసినట్టుగా రఘునందన్ రావు చెప్పారు. కానీ రూ.7,380 కోట్లుగా అరవింద్ కుమార్ ఎలా ప్రకటించారని రఘునందన్ రావు ప్రశ్నించారు .టెండర్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కంపెనీ బిడ్ దాఖలు చేసిన అమౌంట్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఈ డబ్బు ఎవరిని అడిగి పెంచారని ఆయన ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ చేసిన ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు అరవింద్ కుమార్ ఫోన్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ డేటాను ప్రభుత్వం బయటపెట్టగలదా అని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 27 వరకు అరవింద్ కుమార్ హైద్రాబాద్ లోనే ఉన్నాడా ఇంకా ఎక్కడికైనా వెళ్లాడా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్ఎల్ కంపెనీ టెండర్ వేసిన మొత్తం కంటే ప్రభుత్వం ఎందుకు ఎక్కువ చెప్పిందని రఘునందన్ రావు అడిగారు.ఓఆర్ఆర్ టెండర్ ఫైనల్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఐదు రోజులు కన్పించకుండా వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించారు.
ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి ఇవ్వాలి కదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఓఆర్ఆర్ కు అదానీ కంపెనీ రూ. 13 వేల కోట్లకు టెండర్ వేసేందుకు సిద్దమైన విషయాన్ని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఓఆర్ఆర్ పై క్రిజిల్ సంస్థ సర్వే రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని రఘునందన్ రావు ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ పై బేస్ ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందన్నారు. కనీసం హెచ్ 1, హెచ్ 2, హెచ్ 2, హెచ్ 4 కంపెనీలు పిలిచి బేస్ ప్రైజ్ కు తక్కువగా బిడ్ కోడ్ చేసినందున టెండర్ ను క్యాన్సిల్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే బాగుండేదన్నారు. ఓఆర్ఆర్ పై ఏప్రిల్ మాసంలో సగటున రూ. 1.80 కోట్లు ఆదాయం వచ్చిందని రఘునందన్ రావు చెప్పారు.