
పెద్దపల్లి : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చదువు రానోళ్లు బిజెపిలో వుంటారంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. చదువు, సంస్కారం గురించి బిజెపికి ఇంకొకలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీ చదువు, సంస్కారమేమిటో మాటల్లోనే బయటపడుతోందని దుబ్బాక ఎమ్మెల్యే మండిపడ్డారు.
అయ్యా హరీష్... గవర్నర్ వ్యవస్థ స్వయంప్రతిపత్తి గల వ్యవస్థ అని గుర్తుంచుకోవాలని రఘునందన్ అన్నారు. ప్రభుత్వ బిల్లులపై గవర్నర్ సంతకం పెట్టకుంటే బిజెపిని బద్నాం చేయాలనే ఆలోచనే మీ సంస్కారాన్ని తెలియజేస్తుందని అన్నారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సబంధం వుంటుందో అవగాహన వున్నా హరీష్ చిలకపలుకులు పలుకుతున్నారని రఘునందన్ మండిపడ్డారు.
వీడియో
గవర్నర్, ముఖ్యమంత్రి కుర్చికి వున్న సంబంధ బాందవ్యాలను చెడగొట్టింది కేసీఆరే అని హరీష్ ఆరోపించారు. గవర్నర్ పదవిలో వున్న మహిళకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానించారు... ఇది మీ సంస్కృతి అంటూ విరుచుకుపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ హక్కులుంటాయి... వారికి నోటీసులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తుచేసారు. అలాంటిది బిజెపి బిల్లులు ఆపుతుందని అనడం అవగాహన రాహిత్యమేనని అన్నారు.
Read More టీఎస్ పిఎస్సి పేపర్ లీక్ పై సిబిఐ దర్యాప్తు చేయించాలి : షర్మిల డిమాండ్
నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఒక్కనాడయినా నిజాలు మాట్లాడావా హరీష్ అంటూ రఘునందన్ మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసిన మీరే బిజెపిపై నిందలు వేయడం తగదన్నారు. దొంగా దొంగా అంటే భుజాలు తడుముకున్నట్లు బిఅర్ఎస్ పార్టీ తీరు వుందన్నారు.
ఉద్యోగ నియామకాల కోసం అధికారంలోకి రాగానే కామన్ రిక్రూట్ మెంట్ ఎందుకు తీసుకురాలేదని రఘునందన్ ప్రశ్నించారు. టీఎస్ పిఎస్సి పేపర్ లీకేజీపై విచారణ కోసం ఏర్పాటుచేసిన సిట్ ఏ లాభం లేదని... ఇప్పటి వరకు ఇలా ఎన్ని సిట్ లు వేశారు... ఎన్ని పరిష్కరమయ్యాయని నిలదీసారు. తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేసారు.
ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రి హరీష్ మండిపడ్డారు. రాష్ట్ర ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ లో పెట్టడం దారుణమని అన్నారు. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ 7 నెలలుగా ఆపారని... దీని వెనుక రాజకీయం ఏంటి అనేది అందరికి తెలుసని అన్నారు. కోర్టులో కేసులు వేస్తే కానీ బిల్లులకు ఆమోదం లభించలేదని హరీష్ అసహనం వ్యక్తం చేశారు.
ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని అన్నారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే 7 నెలలు ఆపి ఆ బిల్లును కూడా నేడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా ? అని ప్రశ్నించారు. తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అన్నారు. 1961 నుంచే బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఉందన్నారు. గవర్నర్ తీరు సబబేనా?.. ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తే.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం గవర్నర్ చర్యలను అసహ్యించుకుంటుందన్నారు. సుప్రీం కోర్టులో కేసు వేస్తే .. నేడు రెండు ముడు బిల్లులు పాస్ చేశారనీ, బీజేపీ రాష్ట్రంలో కుట్రలు చేస్తోందనీ, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటుందని మంత్రి హరీష్ మండిపడ్డారు.