దళితులకు మూడెకరాల భూమి... సీఎం కేసీఆర్ పై సభాహక్కుల నోటీసులు: ఎమ్మెల్యే రఘునందన్

By Arun Kumar PFirst Published Oct 10, 2021, 9:29 AM IST
Highlights

దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీపై వెనక్కితగ్గిన సీఎం కేసీఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు అందించే విషయంపై పరిశీలిస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బిజెపి ఎమ్మెల్యే రఘునందర్ రావు తెలిపారు. దళితుల మూడెకరాల భూమి పంపిణీ హామీపై వెనక్కి తగ్గడమే కాదు తాము అసలు ఆ హామీయే ఇవ్వలేదని కేసీఆర్ వెల్లడించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో వుండి అసెంబ్లీ సాక్షిగా దళితులకు మూడెకరాలు భూమి విషయంలో అవాస్తవాలు మాట్లాడిన కేసీఆర్ పై చర్యలకు సభాహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు రఘునందర్ రావు తెలిపారు. 

నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానని తాము హామీ ఇవ్వలేదని భగవద్గీత, ఖురాన్, బైబిల్ పై ప్రమాణం చేయగలరా? అని  సీఎం KCR ను raghunandan rao ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా దళితులకు మూడెకరాల భూమి హామీ తప్పుగ ప్రచురితమైందా? అంటూ ఎద్దేవా చేసారు. 

read more  జనాభా గణనలో బీసీ కుల గణన : తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

ఇటీవల telangana assembly లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దళితులకు తామసలు మూడెకరాల భూమి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని... అలాంటి హామీ తామెప్పుడు ఇవ్వలేదని అన్నారు. గతంలో భూపంపిణీ అశాస్త్రీయంగా జరిగిందని... వ్యవసాయానికి అనుకూలంగా భూమి ఇవ్వలేదన్నారు. ఓ కుటుంబానికి కనీసం మూడెకరాల భూమి వుంటే శాస్త్రీయంగా వుంటుందన... కానీ గత ప్రభుత్వాలు కొందరికి ఒకటీ అర ఎకరాలు, మరికొందరికి రెండుకరాలు ఇలా అశాస్త్రీయంగా భూపంపిణీ చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇకపై తమ ప్రభుత్వం ఎవరికైనా భూమిని అందివ్వాలని నిర్ణయిస్తే కనీసం మూడెకరాలు వుండేలా చూస్తామని మాత్రమే చెప్పినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అదే హామీని మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు. అంతేకాని దళితులకు మూడెకరాల భూమిని అందిస్తామని హామీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ స్పష్టంచేసారు. 

అయితే 2014 ఆగస్ట్ 15న తెలంగాణ  రాష్ట్రంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ గోల్కొండ కోట నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ భూ పంపిణీ పథకం పేరును భూ కొనుగోలు, పంపిణీ పథకంగా మార్చారన్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుకు కుటుంబంలోని మహిళ పేరు మీద మూడెకరాల భూమిని ప్రభుత్వం అందిస్తుందని... అవసరమైన చోట భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా కొనుగోలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని... ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాటతప్పడం తగదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
 

click me!