చేరికల కమిటీ చైర్మన్ కాదు.. బ్రోకర్ల కమిటీ చైర్మన్.. ఈటెలపై పాడి కౌశిక్ ధ్వజం

By Mahesh KFirst Published Aug 2, 2022, 2:09 PM IST
Highlights

ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ విమర్శలతో ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని చేరికల కమిటీ కేవలం తెలంగాణ బీజేపీలో మాత్రమే ఉన్నదని, ఆ కమిటీకి చైర్మన్ ఈటెల అని తెలిపారు. ఈటల.. చేరికల కమిటీ చైర్మన్ కాద కదా.. బ్రోకర్ల కమిటీ చైర్మన్ అని విమర్శించారు. బీజేపీ అధిష్టానం ఆయనను బ్రోకర్‌గానే చూస్తున్నదని ఆరోపించారు.
 

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ పై టీఆర్ఎస్ నేత.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈటెలను బ్రోకర్ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేరికల కమిటీ లేదని, కానీ, తెలంగాణ బీజేపీలో మాత్రమే చేరికల కమిటీ ఉన్నదని కమలం పార్టీపై విమర్శలు సంధించారు. ఈ కమిటీకి ఈటెల రాజేందర్ చైర్మన్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. ఆయన చేరికల కమిటీ చైర్మన్ కాదని, బ్రోకర్ల కమిటీ చైర్మన్ అని విమర్శలు చేశారు. 

ఈటెల రాజేందర్ హుజురాబాద్‌లో యాక్టర్ అని, హైదరాబాద్‌లో జోకర్ అని, అదే ఢిల్లీలో అయితే బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన హుజురాబాద్ నియోజకర్గంలో ఏం అభివృద్ధి చేశాడో చూపించాలని సవాల్ విసిరారు. ఈటెల ఆయన చేసిన అభివృద్ధిని చూపిస్తే.. తాను కూడా కేసీఆర్ ఏం అభివృద్ధి చేశాడో చూపిస్తానని అన్నారు. ఇక్కడ ఏం అభివృద్ధి చేశావని, గజ్వేల్‌కు వెళ్లుతానంటున్నావ్ అని నిలదీశారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 5వ తేదీన హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాలేదంటే.. అభివృద్ధి చేయలేనట్టేనని పేర్కొన్నారు.

హుజురాబాద్‌లో మళ్లీ గెలిచి పది నెలలు అయిందని, ఒక్క లక్ష రూపాయిల అభివృద్ధి అయినా చేసిండా? అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఈటెల తేలేడని, ఆ పార్టీ ఎంపీలూ తేలేదని అన్నారు. ఈటెల కేంద్రం నుంచి 100 కోట్ల నిధులు తెస్తే.. తాను టీఆర్ఎస్ నుంచి 120 కోట్ల నిధులు తెస్తానని సవాల్ విసిరారు. ఈటెల స్వగ్రామం కమలాపూర్‌లో కనీసం బస్టాండ్ కూడా కట్టలేని దౌర్భాగ్య స్థితి ఆయనదని అన్నారు.

శిలాఫలకాలపై ఈటెల రాజేందర్ పేరు లేదని ఆయన అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ అన్నారు. ఏ ఒక్క శిలాఫలకంపై అయినా ఈటెల పేరు లేకుంటే తాను ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీకి ఈటెలను అధికారులు పిలిచినా.. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ కార్యక్రమానికి రావడం లేదని తెలిపారు. కమలాపూర్ గ్రామ సభకు, స్వగ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

click me!