భాజపా: అప్పుడే గాల్లో మేడలు

First Published Mar 11, 2017, 12:10 PM IST
Highlights

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగింటిలోనూ భాజపానే అధికారం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, యూపి, ఉత్తరాఖండ్ లో తప్ప మిగితా మూడింటిలోనూ ఓటమిపాలైంది కమలం పార్టీ.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడటంతోనే స్ధానిక భాజపా నేతలు గాల్లో మేడలు కట్టేస్తున్నారు. ఈ ఫలితాలను చూస్తుంటే భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం సాధించటం తధ్యమట. తెలంగాణా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తామని చెబుతున్నారు. నిజంగా లక్ష్మణ్ కు ఎంత ఆశో. పార్టీ పరిస్ధితి ఏమిటో కూడా అంచనా వేసుకోకుండా ఆశల మేడలు కట్టేస్తున్నారు. ఎక్కడో యూపిలో పార్టీ అధికారంలోకి వచ్చేస్తే వెంటనే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వచ్చేసేంత సీన్ ఉందా? అంటే కర్నాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చిందనుకోండి.

 

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేసే వారికి చెంప పెట్టట. కుల, మత రాజకీయాలు అందరూ చేస్తున్నదే. యూపి ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పోలింగ్ అయిపోగానే స్వయంగా మోడినే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకోవటం ఎవరికి తెలీదు? రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను ప్రజలు సహించరట. అప్పటికేదో భాజపా పాలిత రాష్ట్రాల్లో అన్నీ సక్రమంగా జరుగుతున్నట్లు. పైగా అదే పేరుతో పనిలో పనిగా తెలంగాణా ప్రభుత్వానికి కూడా లక్ష్మణ్  ఓ హెచ్చరిక పడేసారు.

 

ఎన్నికల ఫలితాలు విశ్లేషణలకు అందకుండా వచ్చాయన్నారు. అంత వరకూ నిజమే. ఎందుకంటే, ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ తప్ప మిగిలిన నాలుగింటిలోనూ భాజపానే అధికారం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, యూపి, ఉత్తరాఖండ్ లో తప్ప మిగితా మూడింటిలోనూ ఓటమిపాలైంది కమలం పార్టీ.

click me!