జితేందర్ రెడ్డి ఇంటికి కొండా, రాములమ్మ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..?

By Siva Kodati  |  First Published Jun 11, 2023, 2:35 PM IST

తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  విజయశాంతిలు భేటీ అయ్యారు. 


బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఇదిలావుండగా.. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి జోష్ తగ్గి కాంగ్రెస్ జోరు పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇలా బిజెపి డీలా పడటంపై అదిష్టానం దృష్టిసారించిందని... ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష మార్పుపై నిర్ణయం తీసుకుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి మాజీ మంత్రులు ఈటల రాజేందర్ లేదా డికె అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు బిజెపి పెద్దలు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు ప్రచారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.  

Latest Videos

ALso Read: బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు.. డీకే అరుణకు అధ్యక్షపగ్గాలు!.. ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ గా ఈటెల?

తెలంగాణ బిజెపి అధ్యక్షున్ని మార్చనున్నారంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని సంజయ్ స్పష్టం చేసారు. ఇతర పార్టీలు చేసే ఈ ప్రచారాన్ని బిజెపి క్యాడర్ నమ్మవద్దని సూచించారు. ఏదయినా వుంటే బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. పార్టీ లైన్ లోనే వుంటూ బిజెపి బలోపేతానికి పనిచేస్తున్నానని... పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. తనను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. బిజెపిని బలహీనపర్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీకయ్యే అవకాశాలు వుండవని... గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బిజెపి నుండి లీకులు లేవని సంజయ్ అన్నారు. 

ఇక డిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయంపై ఈడీ, సిబిఐ విచారణ కొనసాగుతోందని సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ ఆధారాలను సేకరిస్తున్నాయని... దొంగలు ఎవరైనా మోదీ ప్రభుత్వం వదిలిపెట్టబోదని అన్నారు. తప్పుచేసిన వారు కాస్త ఆలస్యమైనా జైలుకు వెళ్లడం ఖాయమని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
 

click me!