
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హన్మకొండలోని అజారా ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ జగదీష్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఇక, జగదీష్‌కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన జగదీష్.. గత కొంతకాలంగా హన్మకొండలోని స్నేహ నగర్‌లో నివసిస్తున్నాడు.
కుసుమ జగదీష్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. జగదీష్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. జగదీష్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక, జగదీష్ ఆకస్మిక మృతి పట్ల ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కుసుమ జగదీష్ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కొద్ది రోజుల క్రితమే నా ములుగు జిల్లా పర్యటనలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. చాలా త్వరగా ఆయన మరణించారు. ఆయన 2 దశాబ్దాలకు పైగా కేసీఆర్, బీఆర్ఎస్‌తో తో ఉన్నారు. చాలా నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన మరణం బీఆర్ఎస్ కుటుంబానికి, ములుగుకు తీరని లోటు. ఈ కష్టమైన దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.