
కరీంనగర్: హుజూరాబాద్ లో జరిగే ఉపఎన్నిక కేవలం ఒక సీటు కోసం మాత్రమే కాదని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. ఈ ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఎక్కడ అనేక మంది ఈటలలు తయారై తనను ప్రశ్నిస్తారో అన్న భయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పట్టుకుందన్నారు. అందుకే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ లో కేసీఅర్ రూ.192 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. ఎది అడిగితే అది ఇవ్వండని ఆదేశించి ఐదుగురు మంత్రులు, పదేసి మంది ఎమ్మెల్యేలను హుజురాబాద్ కు సీఎం పంపించాడని ఈటల అన్నారు.
హుజూరాబాద్ పట్టణంలో బిజెపి నిర్వహించిన కుల సమ్మేళనంలో మాజీ మంత్రి ఈటల, మాజి ఎంపి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... హుజూరాబాద్ లో బిజెపి నాయకులపైనే కాదు టీఆర్ఎస్ ఇంఛార్జిలపై కూడా నిఘా వుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిలుగా వున్నవారితో తనకు సంబంధాలు వున్నమాట వాస్తవమేనని అన్నారు. చివరకు మంత్రి హరీష్ రావు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా నాకే ఓటు వేస్తదని ఈటల అన్నారు.
''హుజూరాబాద్ నియోజకవర్గంలో గత మూడు రోజుల నుండి దసరా పండుగ నడుస్తుంది. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం గొప్పది అని నిరూపిస్తున్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు. తెలంగాణలో రాజకీయ విలువలు లేవు... కేవలం కేసీఅర్ అరాచకం మాత్రమే ఉంది'' అని మండిపడ్డారు.
read more కేసీఆర్‌ను రా.. నన్ను ఓరేయ్, బీజేపీలో చేరాక భాష మారింది: ఈటలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
''నా పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో సంస్కారహీనంగా ఏనాడూ మాట్లాడలేదు. 2014 లో కేసీఅర్, హరీష్ రావు ఆస్తులు ఏంటో అందరికీ తెలుసు. 119 నియోజకవర్గాల్లో నేనొక్కడినే ఉంటే అయిపోతది కదా... మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు అని కేసీఅర్ అనుకుంటున్నట్లున్నారు. తెలంగాణ లో అందరు ఎమ్మెల్యేల మీద నిఘా ఉంది. ఎమ్మెల్యే లను కూడా నమ్మని మీకు ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉందా?'' అని కేసీఆర్ ను ప్రశ్నించారు.
''హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్సినా, బిసినా అని కాదు... కేసీఅర్ కు కావల్సింది ఒక బానిస. రాజేందర్ అనే వ్యక్తి రాజీనామా చేసి కూడా సాదిస్తుండు అంటున్నారు ప్రజలు. నేను అదృష్టవంతున్ని... నా రాజీనామా వల్ల ఏడు సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న పనులు అన్ని జరుగుతున్నాయి. ఇది ఒక్క హుజూరాబాద్ లో నే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని కోరుతున్నా'' అన్నారు.
''దుబ్బాకలో బిజెపి గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగలేదు... ఇక్కడ హుజూరాబాద్ లోనూ అగవు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పార్టీలు ముఖ్యం కాదు... ఈటల రాజేందర్ ముఖ్యం. నా దగ్గర ఎన్నిసార్లు ఎక్కువ కనపడితే అంత విలువ పెరుగుతుంది. బక్కపల్చని ఈటల చిన్నోడే అయితే ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చుపెడుతున్నావు. నేను గెలిస్తే హుజూరాబాద్ ప్రజలు గెలిచినట్టు... ఓడిపోతే మనం ఓడిపొయినట్టు'' అన్నారు ఈటల రాజేందర్.