హుజురాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ రావు ఘన స్వాగతాన్ని చూసి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. మంత్రిగా ఈటల రాజేందర్ చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేస్తాడా? అని ప్రశ్నించారు. సంక్షేమ ఫలాలందించే టీఆర్ఎస్ పార్టీనా? ధరలు పెంచే బీజేపీ పార్టీనా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రైతు బంధు పథకాన్నే వద్దన్న ఈటల ఏం సంక్షేమమందిస్తారో ఆలోచించుకోవాలని సూచించారు.
హుజురాబాద్: త్వరలో ఉప ఎన్నిక జరగనున్న హుజరాబాద్ నియోజకవర్గానికి చేరిన రాష్ట్రమంత్రి హరీశ్ రావుకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని, హుజురాబాద్‌లో తనకు లభించిన స్వాగతమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్‌పై విమర్శలు కురిపించారు. ‘ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థులు వాళ్లు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి. కానీ, ఈటల మాత్రం నన్ను చూసి ఓటేయమంటున్నాడు’ అని చురకలంటించారు. బీజేపీలో ఉంటూ ఆత్మవంచన చేసుకుని ఆత్మగౌరవం అంటున్నాడని ఆరోపించారు.
గెల్లు శ్రీనివాస్‌కు క్యాబినెట్ ఆశీర్వాదం
ఈటల రాజేందర్ గెలిస్తే ఒక్కరే గెలిచినట్టు అని ప్రజలంతా ఓడినట్టేనని హరీశ్ రావు అన్నారు. రైతు బంధు పథకాన్నీ ఈటెల వద్దన్నారని తెలిపారు. కానీ, తీరా అమలయ్యాక పది లక్షలు రైతు బంధు తీసుకున్నాడని చెప్పారు. ఈటల రాజేందర్‌తో సంక్షేమం సాధ్యం కాదని ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు రాష్ట్రమంత్రివర్గం ఆశీర్వాదముందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్‌లు కడితే హుజురాబాద్‌లోనే ఎందుకు కట్టలేదని ఈటలపై హరీశ్ రావు ప్రశ్నలు కురిపించారు. ఈటల దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా ఒక్క డబుల్ బెడ్ రూం కట్టలేదన్నారు. ఎంపీగా బండి సంజయ్ గెలిస్తే పది లక్షల పనైనా చేసిండా అని అడిగారు. అలాంటప్పుడు ఈటల ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తాడో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మహిళా భవనం ఉన్నదని, హుజురాబాద్ నియోజకవర్గంలో ఎందుకు లేదని అడిగారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే గ్రామానికి రూ. 25 లకక్షలతో మహిళా భవనాలు నిర్మిస్తామని హామీనిచ్చారు. అంతేకాదు, నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తారని, వీటితోపాటు ఖాళీ జాగాలున్న వాళ్లకు కూడా ఇళ్లు కట్టిస్తామని వాగ్దానమిచ్చారు. ఇల్లందకుంట ఆలయాన్ని పదికోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
undefined
ఓటమి భయంతోనే భాష మారింది
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశమిచ్చిన కేసీఆర్‌ను ఈటల ‘రా’ అంటున్నాడని, బీజేపీలో చేరాక రాజేందర్ భాష మారిందని హరీశ్ రావు అన్నారు. ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే మాటలు జారుతున్నాడని తెలిపారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కొడుకు గుండె మీద తన్నినట్టుగానే రాజేందర్ వ్యవహారమున్నదని చెప్పారు. తండ్రి లాంటి కేసీఆర్‌ను, తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తన్నాడని అన్నారు. బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకుని ఆత్మగౌరవం అంటున్నాడని తెలిపారు. ఆత్మగౌరవం అంటూ గడియారాలు, కుట్టుమిషన్లు, సెల్‌ఫోన్లు, టీ షర్ట్‌లు పంచుతున్నాడని చెప్పారు. అందుకే ప్రజలు గడియారాలు నేలకేసి కొడుతున్నారన్నారు. గడియారంలో ఈటల రాజేందర్, పువ్వు బొమ్మ మాత్రమే పెట్టారని, ధరలు పెంచిన మోడీ, అమిత్ షా బొమ్మ పెట్టలేదని చెప్పారు.
సంక్షేమ పార్టీనా? ధరలు పెంచే పార్టీనా?
టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీ అని, బీజేపీ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచే పార్టీ అని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అన్ని ప్రైవేటుపరం చేసిన, ధరలు పెంచిన బీజేపీ వైపు ఉందామా? సంక్షేమ పథకాలనిచ్చి ప్రజల క్షేమాన్నిగోరే టీఆర్ఎస్‌వైపు నిలుచుందామా? అని ప్రజలను అడిగారు. ఇక కాంగ్రెస్‌కైతే ఇక్కడ డిపాజిట్ కూడా దక్కదని, టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉన్నదని స్పష్టం చేశారు.