సీబీఐని రాకుండా చేసి.. కేసుల నుంచి బయటపడదామనేనా : జీవో నెం 51 డీకే అరుణ స్పందన

Siva Kodati |  
Published : Oct 30, 2022, 04:24 PM IST
సీబీఐని రాకుండా చేసి.. కేసుల నుంచి బయటపడదామనేనా : జీవో నెం 51 డీకే అరుణ స్పందన

సారాంశం

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 51పై స్పందించారు తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ. ఎప్పుడో ఆగస్టులో విడుదల చేసిన జీవోను ఇప్పటిదాకా రహస్యంగా ఎందుకు వుంచాల్సి వచ్చిందని ఆమె నిలదీశారు. తప్పు చేసి, ప్రజల సొమ్మును కాజేసిన వాళ్లు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని ఆమె హెచ్చరించారు.   

టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ నేత డీకే అరుణ. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 51పై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీఐని చూసి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఏ తప్పూ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని కేసీఆర్‌ని అరుణ నిలదీశారు. సీబీఐకి గతంలో ఇచ్చిన సమ్మతిని ఎందుకు ఉపసంహరించున్నారని ఆమె ప్రశ్నించారు. ఎప్పుడో ఆగస్టులో విడుదల చేసిన జీవోను ఇప్పటిదాకా రహస్యంగా ఎందుకు వుంచాల్సి వచ్చిందని డీకే అరుణ నిలదీశారు. 

రాష్ట్రాన్ని దోచుకోకుంటే.. పేదల భూములను ధరణి పేరుతో కబ్జా చేయకుంటే సీబీఐ అంటే అంత ఉలికిపాటు ఎందుకని ఆమె ఎద్దేవా చేశారు. జీవో 51 జారీ చేసి కేసుల నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటే అమాయకత్వమేనని అరుణ అన్నారు. తప్పు చేసి, ప్రజల సొమ్మును కాజేసిన వాళ్లు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని ఆమె హెచ్చరించారు. 

ALso Read:తెలంగాణలోకి సీబీఐకి నో ఎంట్రీ.. రెండు నెలల కిందటే జీవో జారీ చేసిన సర్కార్..!

కాగా... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన తెలంగాణ హోం శాఖ  జీవో నెంబర్ 51 జారీ చేసింది. తద్వారా గతంలో సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంది. గతంలో సీబీఐ ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెకక్కి తీసుకుంది. తెలంగాణలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది. అయితే తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

ఇదిలా ఉంటే.. సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని అన్ని రాష్ట్రాలు ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలు సందర్భాల్లో కోరిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ సీబీఐతో సహా అన్ని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ రెండు నెలల క్రితమే సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఇ) చట్టం, 1946లోని సెక్షన్ 6 ప్రకారం.. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి ఆయా ప్రభుత్వాల సమ్మతి అవసరం. సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే.. ఆయా రాష్ట్రాల పరిధిలో కేసు నమోదు చేయడానికి సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందాలి. ఇక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ సహా పలు రాష్ట్రాలు తమ పరిధిలోని కేసులను సీబీఐ విచారించేందుకు ఇప్పటికే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?