నవంబర్ 12న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Oct 30, 2022, 3:59 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఇది అధికారిక కార్యక్రమం కావడంతో కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో.. శనివారం కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఆర్‌ఎఫ్‌సీఎల్ యూనిట్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. 

జిల్లా కలెక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖరరెడ్డితో కలిసి సింఘాల్ యూనిట్‌ను సందర్శించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్, ఎన్టీపీసీలో హెలిప్యాడ్, బహిరంగ సభ నిర్వహించే మహాత్మాగాంధీ స్టేడియంలను వారు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను, రూట్ మ్యాప్‌ను కూడా పరిశీలించారు. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ రూపేష్ కుమార్, ఎన్‌టీపీసీ సీజీఎం సునీల్ కుమార్, ఆర్‌ఎఫ్‌సీఎల్ జనరల్ మేనేజర్ ఝా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సహజ వాయువు ఆధారిత అమ్మోనియా యూరియా కాంప్లెక్స్ అయిన ఆర్‌ఎఫ్‌సీఎల్ గతేడాది మార్చి 22న రామగుండం యూనిట్ యొక్క వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించినట్టుగా ప్రకటించింది. ఇక, గతంలో మూత బడిన రామగుండం ఎఫ్‌సీఐ (ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. దాని స్థానంలోనే  గ్యాస్ ఆధారిత యూరియా తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు 2015  ఫిబ్రవరి 17న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణకు రూ. 6,120 కోట్ల అంచనా వ్యయంతో 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఎఫ్‌సీఐ స్థానంలోనే గ్యాస్‌ ఆధారిత ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను నిర్మించారు.

సీఎం కేసీఆర్ హాజరవుతారా..?
గత కొంతకాలంగా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భాల్లో కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజా పర్యటకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూడాల్సి ఉంది. 

click me!