బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్.. లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు

By SumaBala Bukka  |  First Published Apr 5, 2023, 7:53 AM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేసి.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 


కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ జ్యోతినగర్ లోని బండి సంజయ్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు  బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు వాహనంలో యాదాద్రి జిల్లా, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో కరీంనగర్ లోని బండి సంజయ్ అత్తగారింట్లోకి కరీంనగర్ ఏసిపి తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు.

బండి సంజయ్ అత్తగారు ఇటీవల మరణించారు. బుధవారం నాడు  తొమ్మిది రోజుల కార్యక్రమానికి  ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనడానికి బండి సంజయ్ కరీంనగర్ లోని జ్యోతి నగర్ కు వచ్చారు. ఈ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  బండిసంజయ్ ను కలిసి తమతో పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. తనను ఏ కేసులో తీసుకువెళ్తున్నారు? ఎందుకు  రావాలి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంట్లో నుంచి కదలనని  మొండికేశారు.

Latest Videos

undefined

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్టు.. ఉద్రిక్తతలు

ఈ క్రమంలోనే పోలీసులు బండి సంజయ్ కు సమాధానం చెబుతూ తమకు అతనిని అరెస్టు చేసి అధికారం ఉంటుందని.. విషయం ఏంటో పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక చెబుతామని అన్నారు. బలవంతంగా సంజయ్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ  క్రమంలో బండి సంజయ్ కు పోలీసులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. వాహనంలో ఆయనను ఎక్కించుకొని హైదరాబాద్ వైపు బయలుదేరారు. కాగా, ఎక్కడికి తీసుకు వెళుతున్నారని కార్యకర్తలు, బంధువులు అడిగితే పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పలేదు. 

మరోవైపు బండి సంజయ్ అత్తగారింటికి పోలీసులు వచ్చారన్న సమాచారంతో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.  బండి సంజయ్ ని అరెస్టు చేయొద్దు అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఇలా ఉండగానే కార్యకర్తలను తోసుకుంటూనే బండి సంజయ్ ని పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లారు. బండి సంజయ్ ని తీసుకెళుతున్న వాహనం ఎల్ఎండి సమీపంలోకి వచ్చేసరికి మొరాయించింది. బండి సంజయ్ ని మరో వాహనంలోకి ఎక్కించి ముందుకు కదిలారు. 

అక్కడి నుంచి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంకు చేరుకొని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో సంజయ్ ను ఉంచారు. ఈ విషయం తెలియడంతో బిజెపి కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. అయితే, బండి సంజయ్ తన అరెస్టును అక్రమమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నానని చెబుతూ లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

అయితే బండి సంజయ్ అరెస్టు విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగా టెన్త్  ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ని అరెస్టు చేసినట్లుగా వినిపించినప్పటికీ..  గతంలో గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించి సిట్ ఆయనకి రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. కానీ బండి సంజయ్ విచారణకు హాజరు కాలేదు. లీగల్ టీంను పంపించారు. ఈ కేసులో అరెస్టు చేశారా? అని మరో ఊహగానాలు వినిపిస్తున్నాయి.

కాగా బండి సంజయ్ అరెస్టు మీద  ఆయన భార్య  ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లి చనిపోతే.. కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చారని.. ఇలాంటి సమయంలో బండి సంజయ్ ని బలవంతంగా తీసుకువెళ్లారని..  ఆయన మూతికి దెబ్బతగిలిందని  చెప్పుకొచ్చారు.  ఆయన అరెస్ట్ అన్యాయమని అన్నారు.

click me!