
యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన సస్పెండ్ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యలో మరో హోం గార్డ్ యాదగిరి ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం యాదగిరి బీబీ నగర్‌లో హోం గార్డ్‌గా పనిచేస్తున్నాడు. రామకృష్ణకు లతీఫ్ గ్యాంగ్‌ను యాదగిరి పరిచయం చేశాడు. ఇక, తన కూతురుని పెళ్లి చేసుకున్న రామకృష్ణపై ఆగ్రహంతో ఉన్న వెంకటేశం.. 6 నెలలుగా అతడిని హత్య చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే లతీఫ్ గ్యాంగ్‌కు సుఫారీ ఇచ్చాడు. దీంతో లతీఫ్ గ్యాంగ్ రామకృష్ణతో పరిచయం పెంచుకుని.. శుక్రవారం ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారు.
మరోవైపు రామకృష్ణది పరువు హత్య కాదని భువనగిరి సీఐ సత్యనారాయణ చెప్పారు. ఆస్తి తగాదాలు మాత్రమే హత్యకు కారణమని తెలిపారు. తనకు ఆస్తి ఇవ్వాలని రామకృష్ణ.. వెంకటేశంను బెదిరించాడని చెప్పారు. ఈ క్రమంలోనే ఆస్తి పోతుందనే భయంతో వెంకటేశం హత్యకు కుట్ర చేశాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. ఇక, నలుగురు నిందితులకు సోమవారం భువనగిరి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వారిని కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.
ఇక, భువనగిరి వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి ఎరుకల రామకృష్ణ, వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం కూతురు భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. అయితే కూతురు కులాంతరం చేసుకుందనే కోపంతో.. రామకృష్ణను వెంకటేశం పలుమార్లు బెదిరించారు. ఇక, భువనగిరిలో విధులు నిర్వహిస్తుండగానే తుర్కపల్లి మండలం వేలుపల్లిలో గుప్త నిధుల కేసులో 2019 అక్టోబరులో రామకృష్ణ సస్పెండ్ అయ్యాడు. బెయిల్‌పై వచ్చాక రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు.
ఇక, రామకృష్ణను హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశం ఇందుకోసం కొన్ని నెలల క్రితమే ప్లాన్ చేశాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రామకృష్ణతో లతీఫ్ పరిచయం పెంచుకున్నాడు. శుక్రవారం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో శనివారం భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు విచారణ చేస్తుండగా హత్య విషయం వెలుగుచూసింది. రామకృష్ణ మృతదేహాన్ని లతీఫ్ ముఠా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం శివారులో రైల్వే బ్రిడ్జి పక్కన గుంతలో పాతిపెట్టినట్టుగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఏ1గా వెంకటేశం, ఏ2గా హోం గార్డు యాదయ్య, ఏ3గా రౌడీ షీటర్ లతీ్‌ఫతో పాటు 11 మందిపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశారు.