
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసింది. శుక్రవారం కనిపించకుండా పోయిన రామకృష్ణ.. దారుణ హత్యకు గురయ్యాడు. తన కుమార్తె భార్గవిని కులాంతర వివాహం చేసుకున్నాడని రామకృష్ణపై కక్ష పెంచుకున్న వీఆర్వో వెంకటేశం సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్య చేయించాడు. తన భర్త రామకృష్ణను హత్యకు గురికావడంతో భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన భర్త హత్యకు సంబంధించి తాజాగా భార్గవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఊపిరితో ఉండగానే తన భర్తను కొట్టి మట్టిలో పూడ్చారని భార్గవి చెప్పింది. తన తండ్రి ఆస్తి కోసం తాము ఆశపడ లేదని ఆమె తెలిపింది. తాను, రామకృష్ణ ఇంటర్ నుంచి ప్రేమించుకున్నామని చెప్పింది.
తాము ప్రేమించుకోవడం తన తండ్రికి నచ్చలేదని భార్గవి తెలిపింది. పెళ్లి చేసుకున్నప్పటీ నుంచి పగ పెంచుకున్నారని చెప్పింది. తన తండ్రి భయానికే నల్గొండ, హైదరాబాద్‌లో ఉన్నామని తెలిపింది. ఆస్తిలో ఒక్క పైసా వద్దని చాలాసార్లు చెప్పానని స్పష్టం చేసింది. ఆస్తి వద్దని సంతకాలు చేశానని తెలిపింది. గతంలో కిడ్నాప్ చేసి.. తనతో సంతకాలు తీసుకుని వదిలేశారని చెప్పింది. తన కూతురు, అత్తలకు దిక్కెవరని ప్రశ్నించారు. తాను ఏదైనా పనిచేసుకుని తన బిడ్డను పోషించుకుంటానని చెప్పింది. తన అత్తను చూసుకునేది ఎవరని.. సాయం అందించాలని కోరింది. తన భర్తను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు కూతురు కులాంతరం వివాహం చేసుకుందనే కక్షతోనే వెంకటేశం.. ఈ హత్య చేయించాడని రామకృష్ణ సోదరుడు రమేష్ అన్నాడు. వెంకటేశంను ఉరి తీయాలని రమేష్ డిమాండ్ చేశారు.
ఇక, తాను కులాంతర వివాహం చేసుకున్నాననే కోపంతో తన తండ్రి డబ్బులిచ్చి హత్య చేయించాడని భార్గవి తెలిపింది. తన బంధువైన మోత్కూరుకు చెందిన యాకయ్య నెల క్రితం లతీఫ్‌ను తన భర్తకు పరిచయం చేశాడని తెలిపింది. శుక్రవారం లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య పథకం ప్రకారం భూములు చూపించాలంటూ తీసుకెళ్లి హత్య చేశారని చెప్పింది.
భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి ఎరుకల రామకృష్ణ, వీఆర్వోగా పనిచేస్తున్న గౌరాయిపల్లికి చెందిన పల్లెపాటి వెంకటేశం కూతురు భార్గవి పెద్దలను ఎదిరించి 2020 ఆగస్టు 16న నల్ల గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు ఆల యంలో వివాహం చేసుకున్నారు. అయితే కూతురు కులాంతరం చేసుకుందనే కోపంతో.. రామకృష్ణను వెంకటేశం పలుమార్లు బెదిరించారు. ఇక, భువనగిరిలో విధులు నిర్వహిస్తుండగానే తుర్కపల్లి మండలం వేలుపల్లిలో గుప్త నిధుల కేసులో 2019 అక్టోబరులో రామకృష్ణ సస్పెండ్ అయ్యాడు. బెయిల్‌పై వచ్చాక రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు.
ఇక, రామకృష్ణను హత్య చేయాలని నిర్ణయించుకున్న వెంకటేశం ఇందుకోసం కొన్ని నెలల క్రితమే ప్లాన్ చేశాడు. సిద్దిపేటకు చెందిన లతీఫ్ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రామకృష్ణతో లతీఫ్ పరిచయం పెంచుకున్నాడు. శుక్రవారం రామకృష్ణ ఇంటికి లతీఫ్, జమ్మాపురం సర్పంచ్ అమృతయ్య వచ్చారు. తమకు భూములు చూపించాలని అడిగి అతన్ని వెంట తీసుకువెళ్లారు. రాత్రి అవుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్గవి పలుమార్లు ఫోన్లు చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో శనివారం భార్గవి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.