రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్:స్ట్రాటజీ రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బుధవారంనాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో ఎన్నికలకు వంద రోజులు మాత్రమే ఉందన్నారు. ఎన్నికల యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ మాదిరిగా తాము వంద హామీలు ఇచ్చి మోసం చేయబోమన్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వాటిని బేరీజు వేసుకొని హామీలు ఇస్తామన్నారు. ఈ నెల 30న కొల్లాపూర్ లో నిర్వహించే సభలో మహిళా డిక్లరేషన్ ను ప్రకటించనున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో వయస్సుతో సంబంధం లేకుండా మహిళలకు రెండువేల పెన్షన్ ను అందిస్తున్ విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి కట్టుగా ఉండాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు .నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే వాటిని మర్చిపోవాలన్నారు.
తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ రకమైన పరిస్థితి లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు. కేటీఆర్ ను కాకుండా బీసీని సీఎంగా కేసీఆర్ చేస్తారా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. బీసీలకు కాంగ్రెస్ ను మించి న్యాయం చేసిన పార్టీ మరోటి లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో డీఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
నల్గొండకు వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను కూడ ఇష్టారీతిలో దూషించారన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఇష్టారీతిలో మాట్లాడితే ఎవరూ ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. తన మాదిరిగా రేవంత్ రెడ్డి ఊరుకొనే వ్యక్తి కాదన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకటంటే నాలుగు మాటలన్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు.
also read:విడతలవారీగా తెలంగాణలో బస్సు యాత్రలు, సభలు: కాంగ్రెస్ సీనియర్ల కీలక నిర్ణయం
ఉచిత విద్యుత్ విషయమై తాను విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి లాగ్ బుక్స్ తీసి నిలదీసిన తర్వాతే రైతులకు విద్యుత్ ను ఎక్కువ గంటలు ఇస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.రానున్న రోజుల్లో తమ కార్యాచరణ తెలిస్తే కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.