
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జీ శంకర్ గౌడ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే అర్హత ఆయనకు లేదని.. ఇన్ని రోజులు నారాయణ వయసుకు గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు. మరోసారి తమ అధినేతపై నోరు జారితే తగిన బుద్ధి చెబుతామని శంకర్ గౌడ్ హెచ్చరించారు. ఇకపై నిన్ను లోఫర్ నారాయణ అని పిలుస్తామని.. నువ్వు రాజకీయ బ్రోకర్, లోఫర్‌వి అంటూ శంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా.. పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని అన్నారు. ఆయన ఒక్క చోట మూడు నిమిషాలు స్థిరంగా నిలబడలేడని విమర్శించారు. ఆయన రాజకీయాలు కూడా అలాగే అస్థిరమైనవని అన్నారు. పవన్ కళ్యాణ్ చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ డ్రెస్ వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత గాడ్సేలా తుపాకీ కూడా పట్టుకుంటాడని తాను సందేహిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఆయన ఒక దళారీ అవతారం ఎత్తారని విమర్శలు సంధించారు.
ALso Read: చెగువేరా నుంచి గాడ్సే వైపు పవన్.. దళారీ అవతారం: పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ప్రత్యేక హోదాను పాచిపోయిన లడ్డూ అని కేంద్రంలోని బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఎన్డీయే గూటికి చేరుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఫిలాసఫీ ఏమని నిలదీశారు. వామపక్షాలపై అభిమానం అని, చెగువేరా తనకు ఆదర్శనమని పవన్ చెప్పారు. ఆయన లైబ్రరీలోనూ వామపక్షాల పుస్తకాలు ఉన్నాయని వివరించారు. ముందు చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ దుస్తులు ఎలా వేసుకుంటున్నారనే తాను ప్రశ్నిస్తున్నానని నారాయణ అన్నారు. చెగువేరా డ్రెస్ వేసుకున్నాడు కాబట్టే తాను ఈ ప్రశ్న వేస్తున్నట్టు స్పష్టించారు.