ఏపీ, తెలంగాణల్లో కేసులు.. పార్టీ మారాలని వేధింపులా: భూమా జగద్విఖ్యాత్ రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 8, 2021, 4:33 PM IST
Highlights

హఫీజ్ పేట్ భూ వివాదంలో కావాలనే తమ అక్క భూమా అఖిలప్రియను ఇరికించారని ఆరోపించారు ఆమె సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి. తమ కుటుంబాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు

హఫీజ్ పేట్ భూ వివాదంలో కావాలనే తమ అక్క భూమా అఖిలప్రియను ఇరికించారని ఆరోపించారు ఆమె సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డి. తమ కుటుంబాన్ని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణలో అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హఫీజ్ పేటలో వున్న 25 ఎకరాల భూమి తమదేనని, తమ ఆస్తులు కాజేసేందుకు కుట్ర జరుగుతోందని జగద్విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు.

ఎఫ్ఐఆర్‌లో పేర్లున్న వారందరూ కిడ్నాప్ సమయంలో ఎక్కడున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుట్రపూరితంగానే కేసులు పెట్టి అఖిలప్రియను ఇరికించారని జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌లో కేసు నమోదైతే ఆళ్లగడ్డలో మా అనుచరులను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విజయవాడలో మా అక్క జనరల్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసి వస్తోందన్నారు.

Also Read:బోయిన్‌పల్లి కేసు: అఖిలప్రియ కస్టడికి కోర్టులో పోలీసుల పిటిషన్

తీవ్ర అస్వస్థతకు గురవుతున్నా జైలులో కనికరం చూపడం లేదన్నారు. ప్రవీణ్, సునీల్ అనే వ్యక్తుల తండ్రి మా నాన్న దగ్గర లాయర్‌గా పనిచేశారని.. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డితో కుమ్మక్కై మా ఆస్తులు కొట్టేద్దామని ప్లాన్ చేశారని జగద్విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు.

అక్క అరెస్ట్ వెనుక చాలా పెద్దవాళ్ల హస్తం వుందని ఆయన చెప్పారు. ఒక ఎంపీ, ఇంకో పెద్ద వ్యాపారవేత్త వున్నారని ఆయన వెల్లడించారు. అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత రాయలసీమలో తమ వర్గాన్ని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నామని జగద్విఖ్యాత్ వెల్లడించారు.

జరిగేది ఒకటైతే.. మీడియాలో మరొకటి బయటకొస్తుందన్న విషయాన్ని గమనించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రహాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని మీడియాలో రాస్తున్నారని.. అయితే చంద్రహాస్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని జగద్విఖ్యాత్ స్పష్టం చేశారు.అతనికి వారం క్రితమే వివాహమైందన్నారు. భయభ్రాంతులకు గురి చేసి పార్టీ మారేలా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 

click me!