
కాంగ్రెస్ సీనియర్ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు. తనకు ఏ పదవి అవసరం లేదని.. తనకు బతుకు తెలంగాణ కావాలని వెంకట్ రెడ్డి అన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు బీసీలకు ఇవ్వాలని సోనియా, రాహుల్ చెప్పారని ఆయన తెలిపారు.
కేసీఆర్ కేబినెట్‌లో ఎక్కువ మంది ఓసీలే వున్నారని.. కేసీఆర్ చేసి రుణమాఫీ కాదని, వడ్డీ మాఫీ మాత్రమేనని వెంకట్ రెడ్డి అన్నారు. బలహీనవర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్ధార్ అంటూ ఎంపీ హెచ్చరించారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ డబ్బులతో రుణమాఫీ చేశారని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వియ్యంకుడికి గంధమల్ల రిజర్వాయర్ పనులు అప్పగించారని వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు.
Also Read: కోమటిరెడ్డి పట్టు: షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం ఖరారు..!
అంతకుముందు కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం, షర్మిల చేరిక తదితర అంశాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కాంగ్రెస్ లోకి ఎప్పుడైనా ఆహ్వానం వుంటుందన్నారు. షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నానని కోమటిరెడ్డి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేసిందని ఆయన ప్రశంసించారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే లాభమే జరుగుతుందని వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల వల్ల 4 ఓట్లు వచ్చినా.. 400ఓట్లు వచ్చినా లాభమేనని ఆయన వ్యాఖ్యానించారు.
అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీదేనని వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కూతురిగా షర్మిలకు కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఆహ్వానం వుంటుందని కోమటిరెడ్డి అన్నారు. షర్మిల చేరికపై పార్టీ హైకమాండ్ అడిగినప్పుడు ఇదే చెబుతానని వెంకట్ రెడ్డి తెలిపారు . ఒకరికొకరు కలిసి బలపడాలని కాంగ్రెస్ భావిస్తోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.