జనగామ సీటును ఆశిస్తున్న బీఆర్ఎస్ కు చెందిన కొందరు అసమ్మతి నేతలు హైద్రాబాద్ టూరిజం హోటల్ లో ఇవాళ సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలు సీఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని హోటల్ లో భేటీ అయ్యారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వవద్దని అసమ్మతి నేతలు కోరుతున్నారు.ఈ విషయమై పార్టీ అధిష్టానికి తమ అభిప్రాయాలు తెలిపేందుకు సీఎం క్యాంప్ కార్యాలయానికి సమీపంలోని టూరిజం ప్లాజా హోటల్ లో భేటీ అయ్యారు. ఈ విషయం తెలిసిన జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి టూరిజం ప్లాజా హోటల్ కు చేరుకునేసరికి అసమ్మతి నేతలు షాక్ కు గురయ్యారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయమై మంత్రి హరీష్ రావును కలిసేందుకు వచ్చినట్టుగా కొందరు నేతలు చెబుతున్నారు. అయితే తాను ప్రగతి భవన్ కు వెళ్తున్నానని తనతో రావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. అయితే ఈ సమయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో వెళ్లేందుకు అసమ్మతి నేతలు అంగీకరించలేదు.
undefined
జనగామ అసెంబ్లీ స్థానం నుండి ఈ దఫా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టిక్కెట్టు ఇవ్వవద్దని అసమ్మతి నేతలు కోరుతున్నారు. పలువురు నేతలు ఈ స్థానం నుండి పోటీ పడుతున్నారు. ఈ స్థానం నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు టిక్కెట్టు ఆశిస్తున్నారు. దీంతో ఇవాళ అసమ్మతి నేతలు టూరిజం ప్లాజాలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టూరిజం ప్లాజాలో భేటీ అయిన నేతల్లో ఒకరిద్దరూ మినహా మిగిలిన వారు కీలక నేతలు కాదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. తన గురించి పార్టీ నాయకత్వానికి తెలుసునన్నారు. కేసీఆర్ ఏ బాధ్యతను అప్పగించినా తాను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మరో వైపు జనగామకు చెందిన బీఆర్ఎస్ నేతలను తాను పిలిపించినట్టుగా సాగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. క్యాంప్ కార్యాలయానికి సమీపంలోని హోటల్ లో జనగామ నేతలు సమావేశమైన విషయం తెలిసిందన్నారు.