ఆర్థిక మంత్రిగా భట్టి బాధ్యతలు... తొలి సంతకంతోనే భారీ నిధుల విడుదల

By Arun Kumar P  |  First Published Dec 14, 2023, 1:54 PM IST

తెలంగాణ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించిన పథకాలకు నిధులు విడుదల చేసారు. ఇలా , ఆరోగ్యశ్రీ ఫైళ్లపై తొలి సంతకం చేసారు ఆర్థిక మంత్రి. 


హైదరాబాద్ : తెలంగాణ, విద్యుత్ శాఖల మంత్రిగా భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. సచివాలయానికి భార్యాపిల్లలతతో కలిసివచ్చిన డిప్యూటీ సీఎంకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నేరుగా ఆర్థిక శాఖ చాంబర్ కు చేరుకున్న భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రాల మధ్య తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ఆర్థిక మంత్రిగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన 'మహాలక్ష్మి',  రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలకు నిధుల విడుదల పైళ్లపై భట్టి విక్రమార్క సంతకం చేసారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలుచేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణలోని మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. తెలంగాణలో ఎక్కడినుండి ఎక్కడికైనా... ఎన్నిసార్లయినా ఆర్టిసి పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగానే ప్రయాణించవచ్చు. మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకుగాను తెలంగాణ ఆర్టిసికి రూ.374 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తొలిసంతకం చేసారు. 

Deputy CM Bhatti Vikramarka Mallu took charge as the Finance, Planning, and Energy Ministries in the State Secretariat.
రాష్ట్ర సచివాలయంలో ఆర్ధిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు. pic.twitter.com/Kn4WQMf13m

— Bhatti Vikramarka Mallu (@BhattiCLP)

Latest Videos

ఇక ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు ఇచ్చిన హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకుగాను రూ.298 కోట్లు వైద్యారోగ్య శాఖకు కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆర్థిక మంత్రి రెండవ సంతకం చేసారు. అలాగే సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లను వివిధ శాఖలకు మంజూరు చేస్తూ మరో ఫైలుపై సంతకం చేసారు. 

Also Read  హెలికాప్టర్లలో తిరిగే ఏకైక ఐఏఎస్ స్మితా సబర్వాల్ మాత్రమే..: మాజీ ఐఏఎస్ మురళి

విద్యుత్ శాఖ మంత్రిగా కూడా భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన రూ.996 కోట్లను విడుదల చేసారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై భట్టి విక్రమార్క సంతకం చేసారు.  

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్కకు రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రాన్స్ కో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, హరిత లతో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రికి పుష్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. 

అంతకుముందు తెలంగాణ ప్రజా భవన్ (ప్రగతి భవన్) లో కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు భట్టి విక్రమార్క. ఇంతకాలం సీఎం క్యాంప్ కార్యాలయంగా వున్న ఈ భవనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ సీఎంకు కేటాయించింది. దీంతో ఇవాళ హోమం నిర్వహించి గృహప్రవేశం చేసింది భట్టి కుటుంబం. ఈ సందర్భంగా ప్రజా భవన్ ఆవరణలోని మైసమ్మ దేవాలయంలోనూ భట్టి విక్రమార్క పూజలు నిర్వహించారు. 

click me!