కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పరిష్కరించనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు
మక్తల్:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.
గురువారంనాడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, కౌలు రైతులతో రాహుల్ గాంధీ సమావేశ మయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి రైతులు రాహుల్ గాంధీతో సమావేశానికి హాజరయ్యారు. రైతుల సమస్యలను రాహుల్ గాంధీ విన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తామన్నారు.ఆత్మహత్యచేసుకున్న రైతు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాగానే ఆర్ధిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.కౌలు రైతుల సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామన్నారు. పలు రైతు సంఘాల నేతలు కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతు సంఘాల నేతలు రాహుల్ దృష్టికి తీసుకు వచ్చారు.
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ రైతులతో సమావేశమయ్యారు. మూడు రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలో భారత్ జోడో యాత్రను పున: ప్రారంభించారు. ఈ నెల 23న భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు జిల్లా నుండి నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించింది.
also read:షోకాజ్‌కి కోమటిరెడ్డి రిప్లై తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం: జైరాం రమేష్
రెండు వారాల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో సాగనుంది. తెలంగాణ రాష్ట్రం నుండి పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో సుమారు 300 కి.మీ.పైగా పాదయాత్ర సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో యాత్ర ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ లో యాత్ర ముగియనుంది. దేశంలోని పలు రాష్ట్రాల గుండా యాత్ర జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. సుమారు 3570 కి.మీ యాత్ర నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ.తమిళనాడు ,కేరళ,కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాయాత్ర ముగిసింది. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది.