కరోనా భయంతో... కన్న కూతురి అంత్యక్రియలకు ముందుకురాని తల్లిదండ్రులు

By Arun Kumar PFirst Published May 22, 2021, 5:57 PM IST
Highlights

ఓ మహిళ అనారోగ్యంతో చనిపోయినా కన్న తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయడానికి నిరాకరించిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

బంజారాహిల్స్‌:  కాలానుగుణంగా ఇప్పటికే తగ్గుతూ వస్తున్న మానవ సంబంధాలను కరోనా మహమ్మారి మరింత దూరం చేసింది. కరోనా సోకితే కన్న తల్లిదండ్రులను, కట్టుకున్నవారినీ, కడుపునపుట్టినవారినీ దూరం పెడుతున్న ఘటనలు మనం నిత్యం చూస్తున్నాం. కానీ ఓ మహిళ అనారోగ్యంతో చనిపోయినా కన్న తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయడానికి నిరాకరించిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా ఖానాపురంకు చెందిన శీలం అరుణశ్రీ(31) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. భర్తతో విడిపోయి ఒంటరిగా యూసుఫ్‌గూడ సమీపంలోని యాదగిరి నగర్‌లో నివాసముంటోంది. బ్యూటీషియన్‌గా పనిచేస్తూ గత ఏడు సంవత్సరాలుగా నగరంంలోనే వుంటోంది. 

అయితే అరుణశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి శుక్రవారం తెల్లవారుజామున మరణించింది. చుట్టుపక్కలవారు ఆమె మరణించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

అయితే హైదరాబాద్ లో కరోనా కేసులు అధికంగా వున్నాయని... తాము రాలేమని తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాదు నిరుపేదలైన తమవద్ద డబ్బులు కూడా లేవని... కాబట్టి మీరే అంత్యక్రియలు జరపాలని కోరారు. దీంతో చేసేదేమిలేక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!