విద్యుత్ సిబ్బందిపై పోలీసులు దాడి... మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : May 22, 2021, 04:20 PM ISTUpdated : May 22, 2021, 04:23 PM IST
విద్యుత్ సిబ్బందిపై పోలీసులు దాడి... మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్

సారాంశం

నల్గొండలో విద్యుత్ సిబ్బందిని చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించారు. 

నల్గొండ: లాక్ డౌన్ నిబంధనల పేరిట అత్యవసర సర్వీసులకు చెందిన విద్యుత్ సిబ్బందిపై పోలీసులు దాడిచేయడంపై సంబంధిత మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ అయ్యారు. నల్గొండలో విద్యుత్ సిబ్బందిని  చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ బాస్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిన మంత్రి పోలీసుల తీరును తప్పుబట్టారు. 

''విద్యుత్ శాఖా అత్యవసర సర్వీసు కిందకు వస్తుంది. కాబట్టి లాక్ డౌన్ కఠినంగా అమలవుతున్నా అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దు. పోలీసులు చట్టబద్ధంగా వ్యహరించాలి. అదే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా పాటించాలి. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఐ డి కార్డులు చూడకుండా లాఠీలకు పని చెప్పొద్దు'' అని మంత్రి సూచించారు. 

అలాగే నల్గొండ సంఘటనలపై జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు మంత్రి. రాత్రి, పగలు తేడాలేకుండా పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిపై దాడులు చేసిన వారిని గుర్తించాలని సూచించారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. 

Also Read:తెలంగాణలో లాక్‌డౌన్ : ఉదయం 10.10 తర్వాత జనం కనిపించొద్దు.. అధికారులకు కేసీఆర్ ఆదేశాలు

ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు జిల్లాల సరిహద్దుల్ని పూర్తిగా మూసివేయనుంది. బోర్డర్ దాటి ఒక్కరూ కూడా రాష్ట్రంలోకి రాకుండా , బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతించనున్నారు. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ తర్వాత కోర్టుకు వచ్చి తీసుకోవాల్సి వుంటుందని స్పష్టం చేశారు. 

కాగా, రాష్ట్రంలోని లాక్‌డౌన్ పరిస్ధితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. 

 రాష్ట్ర రెవెన్యూను లెక్క చేయకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని... కలెక్టర్లు, డీజీపీ, పోలీసు అధికారులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు. వారం పదిరోజుల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వరంగల్ సెంట్రల్ జైలును మరో చోటకు తరలిస్తామని కేసీఆర్ వెల్లడించారు. సెంట్రల్ జైలు స్థానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిథులు, సర్పంచ్‌లు లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు.

ఉదయం 10.10 తర్వాత రోడ్డుపై ఎవరూ కనిపించొద్దని సీఎం ఆదేశించారు. కోవిడ్ వార్డులో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, సేల్స్‌మెన్స్ కోసం వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ సెక్రటరీ ఈ జిల్లాలకు వెళ్లి పరిస్ధితులను సమీక్షించాలని సీఎం ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేసీఆర్ సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu
Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu