పండుగ పూట జరభద్రం.. ఇల్లు విడిచి ప్రయాణిస్తే చెప్పి వెళ్లండి: సీపీ మహేష్ భగవత్

By Mahesh KFirst Published Oct 3, 2022, 7:57 PM IST
Highlights

దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి దొంగతనాలను నివారించుకోవాలని రాచకొండ సీపీ ప్రజలకు సూచించారు. ఇల్లు విడిచి వెళ్లే వారు తమ నగలను బ్యాగుల్లో పెట్టుకుని వెళ్లరాదని తెలిపారు.

హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని రాచకొండ సీపీ మహేష్ భగవత్ పౌరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచనలు చేశారు. తమ విలువైన వస్తువులను చోరీకి గురికాకుండా పోలీసులు ఇచ్చిన సూచనలు పాటించాలని వివరించారు.

పండుగ సందర్భంగా ఇల్లు విడిచి వెళ్లే వారు ముఖ్యంగా ప్రభుత్వ రవాణా వాహనాల్లో వెళ్లితే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సీపీ సూచించారు. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించేవారు నగలను బ్యాగుల్లో పెట్టుకుని వెళ్లొద్దని, అలా వెళితే అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువ అని తెలిపారు. అలాగే, ఇంటి తలుపులు, కిటికీలు, టెర్రస్ డోర్, కిచెన్ డోర్లూ అన్నీ సరిగ్గా వేయాలని వివరించారు. అన్ని సరిగ్గా తాళాలు వేసుకోవాలని పేర్కొన్నారు. తాళాలు అన్ని సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలని వివరించారు.

అలాగే, ఇల్లు విడిచి వెళ్లిపోతున్నవారు.. తమ ఇంటిపై ఓ కన్ను వేసి ఉంచాలని బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు. అవసరమైతే స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇచ్చి వెళ్లడం మరింత మంచిదని వివరించారు. తద్వార స్థానిక బీట్ కానిస్టేబుల్ వారి ఇంటిపై ఓ కన్నేసి ఉంచే అవకాశం ఉంటుందని తెలిపారు. 

సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా 24 గంటల భద్రత లభిస్తుందని వివరించారు. అంతేకాదు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం కూడా చోరీలను నివారించడానికి మంచి మార్గం అని తెలిపారు. సాధారణ తాళాలు వేస్తే ఇల్లు వదిలి వెళ్లినట్టు తెలుస్తుందని, అదే సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే లోపల యజమానులు ఉన్నది లేనిది తెలియదని చెప్పారు. పోలీసులు నిరంతరం నిఘా వేసే ఉంచుతారని భరోసా ఇచ్చారు.

click me!