బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల వరకే దేవుడు అనే తీరులో కామెంట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తూ బరిలోకి జనసేన పార్టీ దిగుతున్న సంగతి తెలిసిందే. కాగా, బండ్ల గణేశ్ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జోరుమీదున్నది. ఈ ఎన్నికల్లో వీరి పార్టీలు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నాయి. తాను కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తానని, అధికారంలోకి కాంగ్రెస్సే వస్తుందని బండ్ల గణేశ్ చెప్పారు.
హైదరాబాద్: బండ్ల గణేశ్ సినిమాలతో ఎంత ఫేమస్సో.. ఆయన కామెంట్లు, వ్యవహారంతో అంతకు మించి పాపులర్ అయ్యారు. ఇంటర్వ్యూల్లో హాస్యభరిత కామెంట్లు చేసి చాలా మందిని ఆకర్షించారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరి కొంత కాలం క్రియాశీలకంగా ఉండి మళ్లీ దూరంగా జరిగారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆయన రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా తెలంగాణలో పోటీకి సై అన్నది. బీజేపీతో పొత్తులో ఇక్కడ బరిలోకి దిగుతున్నది. దీంతో బండ్ల గణేశ్ వైఖరిపై ఆసక్తి పెరిగింది.
పవన్ కళ్యాణ్‌ను బండ్ల గణేశ్ ఆకాశానికెత్తుతారు. ఎప్పుడు వీలు చిక్కినా పవన్ తన దేవుడు అంటు కామెంట్ చేస్తుంటారు. విపరీతమైన అభిమానాన్ని చాటుకుంటారు. కానీ, వీరిద్దరూ సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ అడుగు వేయడంతో ఈ రిలేషన్ పాలిటిక్స్‌లోనూ కొనసాగుతుందా? అనే ఆసక్తి ఏర్పడింది. ఇద్దరు ఫోకస్ పెట్టిన రాష్ట్రాలు వేర్వేరు కావడంతో ఈ క్లాష్ ఇది వరకు రాలేదు. కానీ, ఇప్పుడు జనసేన తెలంగాణలోనూ పోటీకి దిగడంతో కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ తన ఎజెండాను బయటపెట్టాల్సి వస్తున్నది.
కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థి పార్టీలని తెలిసిందే. తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు తెలుపుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న బండ్ల గణేశ్ తన స్వరాన్ని మార్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ కార్యకర్తనని, ఈ పార్టీకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు, రేవంత్ సారథ్యంలో తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
Also Read: Bandla Ganesh:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బండ్ల గణేష్ జోస్యం.. ఇంతకీ ఏమన్నారంటే..?
ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పార్టీ బీజేపీతో కలిసి బరిలో దిగుతున్నదని, అంటే.. మీరిద్దరూ ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నారని, పవన్ గురించి ఏం చెబుతారని ఓ మీడియా ప్రతినిధి బండ్ల గణేశ్‌ను అడిగారు. రాజకీయాల్లో తనకంటూ సొంత ఎజెండా ఉన్నదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 9న కాంగ్రెస్ నేత సీఎంగా ప్రమాణం చేస్తారని వివరించారు. పవన్ వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలితే కాంగ్రెస్‌కు నష్టం కదా? అని అడగ్గా.. తాను అవన్నీ మాట్లాడకూడదని దాటవేశారు.