నేనొస్తే కామారెడ్డికి చాలా వస్తాయి .. నాపై పోటీకి ఓ దొంగ, ఆలోచించి ఓటేయ్యండి : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Nov 9, 2023, 4:08 PM IST

కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని యత్నించారని.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన వ్యక్తే కామారెడ్డిలో నాపై పోటీకి వచ్చారని సీఎం దుయ్యబట్టారు. 


కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సిందిగా ఇక్కడి నాయకులు తనను కోరారని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కామారెడ్డి పల్లెల రూపురేఖలు మార్చే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కామారెడ్డిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చామని సీఎం అన్నారు. 

కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డితో తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం వుందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. నెహ్రూనే దళితబంధు పెట్టి వుంటే.. ఇప్పుడు దళితుల పరిస్థితి ఇలా వుండేది కాదన్నారు. 24 గంటల కరెంట్ కావాలా.. 3 గంటల కరెంట్ కావాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని సీఎం నిలదీశారు. 

Latest Videos

undefined

నేను కామారెడ్డికి వస్తే చాలా వస్తాయని.. బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తామని కేసీఆర్ చెప్పారు. గుజరాత్‌లోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని.. మన దగ్గర ఇస్తున్నామని సీఎం అన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. రైతుబంధు ఉండాలా, వద్దా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వని బీజేపీకి, ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని సీఎం నిలదీశారు. ఎప్పుడూ వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ.. ధరణి తీసేస్తామంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.     

50 లక్షలతో దొరికిన వ్యక్తి ఇవాళ నాపై పోటీకి దిగుతున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్నీ ఆలోచించి కామారెడ్డి ప్రజలు తీర్పు చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.25 వేల కోట్లను కేంద్రం కోతపెట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు. 180 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాడ్డాక ధరణి పోర్టల్ తీసుకొచ్చామని.. రైతు బొటనవేలు పెడితేనే భూ మార్పిడి జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. 

భూ మార్పిడి చేసే హక్కు సీఎంకు కూడా లేదని సీఎం వెల్లడించారు. రైతుబంధు నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని.. ధరణి తొలగిస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలని ఆరోపిస్తున్నారని.. ఈ మాట అంటున్న వారిని అక్కడే వేయాలని సీఎం పిలుపునిచ్చారు. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని యత్నించారని.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వచ్చిన వ్యక్తే కామారెడ్డిలో నాపై పోటీకి వచ్చారని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో రాజకీయ అస్థిరత తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు. తెలంగాణను బతకనీయొద్దని చూశారని.. కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

click me!