
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి షెడ్యూల్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఏం పనులున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ను సభకు రావాల్సిందిగా తాము కోరామని చెప్పారు. ఈ రోజు ప్రధాని మోదీ సభలో కుర్చీ కోసం ఏర్పాటు చేశారని అన్నారు. కేసీఆర్ కోసం వేచి చూశామని చెప్పారు. మోదీ సభకు సీఎం కేసీఆర్ వచ్చి ఉంటే ఆయనను శాలువతో సత్కరించేవాళ్లమని చెప్పారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ది నిరోధకుడిగా మారారని మండిపడ్డారు. కేసీఆర్ అభివృద్దికి సహకరించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ సభకు ఎందుకు రాలేదో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే, ఈరోజు పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ‘‘కేంద్రానికి చెందిన చాలా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ప్రతి ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన ఏ పనికి ఆటంకం కలిగించవద్దని కోరుతున్నాను. నేటి నవ భారతదేశంలో, దేశప్రజల ఆశలను నెరవేర్చడమే మా ప్రాధాన్యత. అయితే ఈ అభివృద్ధి పనుల పట్ల కొద్దిమంది చాలా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ పాలన, బంధుప్రీతి, అవినీతిని పెంచి పోషిస్తున్న ఇలాంటి వ్యక్తులు నిజాయితీగా పనిచేసే వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాంటి వారికి దేశ ప్రయోజనాలతో, సమాజ శ్రేయస్సుతో సంబంధం ఉండదు. అలాంటి వారు తమ కుటుంబం అభివృద్ధి చెందాలని మాత్రమే ఇష్టపడతారు. ఇలాంటి వారితో తెలంగాణ చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పెంచాం. లబ్దిదారులకు నేరుగా పథకాలను అందజేస్తున్నాం’’ అని అన్నారు.
కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని.. కుటుంబ వాదం ఉన్నచోటే అవినీతి పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. అవినీతిపరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ప్రశ్నించారు. తనపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని అన్నారు. కోర్టుకు కూడా వెళ్లారని.. అక్కడ వారికి షాక్ తగిలిందని అన్నారు. తెలంగాణలో పేదలకు ఇచ్చే రేషన్‌ను కూడా కుటుంబ పాలన దోచుకుంటోందని విమర్శించారు.
భారతదేశ సమగ్ర ప్రగతికి తెలంగాణ వేగవంతమైన పురోగతి ముఖ్యమని చెప్పారు.