తెలంగాణ పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాన్ని లీక్ చేసారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ప్రస్తుతం కరీంనగర్ జైల్లో పెట్టారు పోలీసులు.
కరీంనగర్ : పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మెడకు చుట్టుకుంది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే ప్రశ్నపత్రం బయటకువచ్చి సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రత్యక్షమవడంతో సంజయ్ పాత్ర వుందంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు. మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సంజయ్ ని హైడ్రామా మధ్య బుధవారం హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.
బండి సంజయ్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కరీంనగర్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. దీంతో కరీంనగర్ జైలుకు సంజయ్ ని తీసుకువచ్చిన పోలీసులు గోదావరి బ్యారక్ లో వుంచారు. జైలు అధికారులు ఖైదీ నెంబర్ 7917 ను సంజయ్ కు కేటాయించారు.
undefined
Read More ఎస్ఎస్సీ పేపర్ లీక్: బండి సంజయ్ పాత్రను గుర్తించారిలా....
కరీంనగర్ జైలుకు చేరుకున్న బండి సంజయ్ ని కలిసేందుకు వచ్చిన కుటుంబసభ్యులకు నిరాశ ఎదురయ్యింది. ఆయనను కలిసేందుకు అనుమతించని జైలు అధికారులు కేవలం బట్టలు, ట్యాబ్లెట్లు మాత్రమే అందజేసేందుకు అంగీకరించారు. దీంతో భర్తను కలవకుండానే బండి అపర్ణ కరీంనగర్ జైలువద్ద నుండి వెనుదిరిగారు.
వీడియో
ఇవాళ(గురువారం) ములాఖత్ కు బండి సంజయ్ కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అనుమతి వస్తే సంజయ్ ను భార్యాపిల్లలతో పాటు ఇతర కుటుంబసభ్యులు కలిసే అవకాశాలున్నాయి. బిజెపి నాయకులు కూడా బండి సంజయ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక కరీంనగర్ జిల్లా కారాగారం వద్దకు బిజెపి నాయకులు, కార్యకర్తలు వస్తుండటంతో హైటెన్షన్ నెలకొంది. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసారు. జైలు వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసి బిజెపి శ్రేణులు రాకుండా అడ్డుకుంటున్నారు.
పదో తరగతి హిందీ పేపర్ లీక్ చేయడంలో బండి సంజయ్ ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు చెబుతున్నారు. తమ విచారణలో సంజయ్ ప్రధాన కుట్రదారుగా తేలడంతో ఆయనను ఈ లీకేజి కేసులో ఏ1గా చేర్చినట్లు తెలిపారు. ఇప్పటికే పేపర్ లీక్ కు పాల్పడిన వారితో పాటు బండి సంజయ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అర్ధరాత్రి కరీంనగర్ లోని సంజయ్ నివాసానికి చేరుకున్న పోలీసులు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసారు. బుధవారం హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేవరకు హైడ్రామా కొనసాగింది.
మొదట గాజుల రామారం పోలీస్ స్టేషన్ కు బండి సంజయ్ ను తరలించిన పోలీసులు రాత్రంతా అక్కడే వుంచారు. ఉదయం పోలీస్ వాహనాల విండోస్ కి అడ్డుగా పేపర్లు పెట్టి ఎవరున్నది కనిపించకుండా చేసి సంజయ్ ని వరంగల్ కు తరలించారు. అక్కడే వైద్యపరీక్షలు చేయించి సాయంత్రానికి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు సంజయ్ ని తరలించారు.
అయితే బండి సంజయ్ అరెస్ట్ పరిణామాలపై బీజేపీ కేంద్ర అధినాయకత్వం దృష్టిసారించింది. బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిణామాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వివరాలు సేకరించారు. అనంతరం తెలంగాణలో పరిస్థితులు, బండి సంజయ్ అరెస్ట్ తదితర వివరాలను జేపీ నడ్డా, అమిత్ షాలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదించినట్టుగా తెలుస్తోంది.