టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ ను తెరమీదికి తెచ్చారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
కరీంనగర్: నీ బిడ్డ జైలుకు పోతుంది , నీ కొడుకును కూడా జైలుకు పంపేందుకు రెడీ చేస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ వీరులు, లిక్కర్ వీరులు కల్వకుంట్ల కుటుంబమేనని ఆయన విమర్శించారు. శుక్రవారంనాడు కరీంనగర్ జైలు నుండి విడుదలైన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
also read:కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ విడుదల
undefined
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశంలో మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయాల భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ డిమాండ్లతో త్వరలోనే వరంగల్ లో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ అంశాన్ని తెర మీదికి తెచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. హిందీ పేపర్ లీక్ కంటే ముందే తెలుగు పేపర్ కూడా లీకైందన్నారు. తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారని ఆయన ప్రశ్నించారు. టెన్త్ క్లాస్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ ను ఎవరు తీసుకెళ్లారని బండి సంజయ్ ప్రశ్నించారు.
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అంశంలో తనపై చేసిన ఆరోపణలన్నీ నిజమేనని తన టోపీపై ప్రమాణం చేయాలని వరంగల్ సీపీ రంగనాథ్ ను కోరారు బండి సంజయ్ .టెన్త్ క్లాస్ హిందీ పేపర్ ను వాట్సాప్ లో ఎవరో తనకు పంపితే కుట్ర ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం లీక్, మాల్ ప్రాక్టీస్ కు కూడా వరంగల్ సీపీకి తేడా తెలియదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రశాంత్ తనతో సంభాషణలు జరిపినట్టుగా ఉన్న ఆధారాలను బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ కోరారు. పేపర్ లీక్ తో తనకు సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. ఈ విషయమై సీపీ ప్రమాణం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
తన అరెస్ట్ విషయంలో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంలో పోలీస్ అధికారులపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పుడు పోలీస్ అధికారులను కాపాడాలని ఆయన కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ ఇంకా ఎన్ని రోజులు ఫాంహౌస్ లో ఉంటారని ఆయన ప్రశ్నించారు. బయటకు రావాలని ఆయన కోరారు.
తనకు జైలు కొత్త కాదు, మరోసారి జైలుకు వస్తానని జైలు అధికారులకు చెప్పి వచ్చానన్నారు. తాను జైలుకు వెళ్లి రావడం ఇది తొమ్మిదోసారన్నారు. తాను లిక్కర్ దందా చేసి జైలుకు వెళ్లలేదన్నారు. ప్రజా సమస్యలపైనే తాను జైలుకు వెళ్లిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
లవంగానికి ,తంబాకుకు తేడా తెలియని మూర్ఖుడు కేటీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. దళితబంధు, రుణమాఫీ, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ పై ప్రశ్నిస్తుంటే తనను పిచ్చోడంటున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉందన్నారు. కానీ కేంద్రానికి 49 శాతం మాత్రమే వాటా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతగా బండి సంజయ్ పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో రామగుండంలో మోడీ స్పష్టత ఇచ్చారని బండి సంజయ్ చెప్పారు.