
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో గందరగోళం చోటుచేసుకుంది. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయితే గంటల తరబడి భక్తుల క్యూలైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే క్యూ లైన్లలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. అయితే తోటి భక్తులు వారికి సపర్యలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ క్రమంలోనే ఆలయంలో ఏర్పాట్లపై పలువురు భక్తులు పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఎవరికైనా ఏదైనా జరిగితే.. ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వీఐపీల తాకిడితోనే ఈ పరిస్థితి తలెత్తిందని సామాన్య భక్తులు ఆరోపిస్తున్నారు. వీఐపీ పాస్‌లు ఎక్కువగా ఇచ్చారని.. దీంతో తాము గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తుందని మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఈ కల్యాణోత్సవం ప్రారంభమైంది. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసమేతంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక, అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు.