పప్పు వేసుకుందామని చూస్తే అందులో పాముపిల్ల కనిపించింది. దీంతో గజగజా వణికిపోయారు ఆ క్యాంటీన్ లో భోజనం చేసే ఉద్యోగులు.
కాప్రా : హైదరాబాదులోని ఈసీఐఎల్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఈవీఎంలు తయారు చేసే డిపార్ట్మెంట్లోని క్యాంటీన్లో ఓ పాము పిల్ల కలకలం రేపింది. క్యాంటీన్లో ఎక్కడో కాదు… పప్పులో మృతి చెంది కనిపించింది. ఇది శుక్రవారం నాడు వెలుగు చూసింది. పప్పులో చనిపోయిన పాము పిల్ల కనిపించడంతో కలకలం ఏర్పడింది.
రోజులాగే శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్ కి భోజనం చేసేందుకు ఉద్యోగులు వచ్చారు. పప్పు వేసుకోవడానికి చూడగా అందులో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. వెంటనే వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే అది గమనించకుండా నలుగురు భోజనాలు చేశారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం.. ఈసీఐఎల్ స్థానిక పోలీసులను, ఉద్యోగ సంఘాల నాయకులను సంప్రదించగా… అది తన దృష్టికి రాలేదని తెలిపారు. పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి మాత్రం క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఘటనకు కారణమైన బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని.. ఈసీఐఎల్ లోని నైట్ షిఫ్ట్ లో ఉన్న ఉద్యోగులు ధర్నా చేశారు.
గతంలో కూడా ఈ క్యాంటీన్ లో ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయట. ఎలుకలు, బీడీలు, సిగరెట్లు, బొద్దింకలు ఆహారంలో కనిపించిన ఘటనలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక్కడ తమకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఉద్యోగాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కంపెనీ యాజమాన్యంపై కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కేసు నమోదు చేయాలని… ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మీద పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఉద్యోగులు కోరుతున్నారు.