రాజకీయ పార్టీలు 70 ఏళ్లుగా ముస్లింలను వాడుకుంటున్నాయి.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2023, 11:14 AM IST
Highlights

దేశంలోని ముస్లింలు వారికి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీల నేతలు భావిస్తుంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీలు ముస్లింలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

దేశంలోని ముస్లింలు వారికి బానిసలుగా ఉండాలని రాజకీయ పార్టీల నేతలు భావిస్తుంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీలు ముస్లింలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. గత 70 ఏళ్లుగా ఈ పార్టీలన్నీ కేవలం ముస్లిం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఫలితంగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఎదగడం కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చదని అన్నారు. దేశంలో అగ్రకులాలే రాజకీయాల్లో ఉండాలని భావన ఉందని విమర్శించారు. 

ఆదివారం రాత్రి చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని... గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని మోదీని ఒవైసీ ప్రశ్నించారు. ‘‘గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీలో చర్చలు జరగడం మీరు చూస్తున్నారు. వలస పాలనతో ముడిపడి ఉన్న చట్టం ఆధారంగా మోదీ ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని అడ్డుకుంది. అల్లర్లు జరిగినప్పుడు మోదీ ముఖ్యమంత్రిగా లేరా?.. బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది... కాంగ్రెస్ ఎంపీని చంపారు’’ అని అన్నారు. కానీ మహాత్మా గాంధీని చంపిన గాడ్సేపై సినిమా తీస్తున్నారని.. భారత ప్రధాని ఆ సినిమాను నిషేధిస్తారా? అని ప్రశ్నించారు. 

హైదరాబాద్ నగరంలో తల్వార్లు, కత్తులతో దాడి చేస్తున్న వారిని ఒక స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసి ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీస్ కమిషనర్‌ను అసదుద్దీన్ కోరారు. దాడులకు పాల్పడే వారికి శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

click me!