జగిత్యాల బీఆర్ఎస్‌లో ముసలం.. మున్సిపల్ చైర్​పర్సన్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబావుటా?

By Sumanth KanukulaFirst Published Jan 23, 2023, 10:21 AM IST
Highlights

జగిత్యాల బీఆర్ఎస్‌లో ముసలం నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణిపై సొంత పార్టీకి చెందిన  కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.

జగిత్యాల బీఆర్ఎస్‌లో ముసలం నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణిపై సొంత పార్టీకి చెందిన  కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. కొద్దిరోజులుగా శ్రావణికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కొందరు కౌన్సిలర్లు.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. శ్రావణి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్న వారు.. ఆమెను గద్దె దింపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తం 48 వార్డులు ఉన్న జగిత్యాల మున్సిపాలిటీలో.. 38 మంది అధికార బీఆర్ఎస్‌కు చెందినవారే. వీరిలో 27 మంది మున్సిపల్ చైర్‌పర్సన్‌ శ్రావణిపై తిరుగుబాటు చేస్తున్నారు. వీరి వెనక వైఎస్ చైర్‌పర్సన్ హస్తం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. 

అయితే కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగిన ఈ అసంతృప్తి.. ఇప్పుడు బహిర్గతం అవుతుంది. మున్సిపల్ చైర్​పర్సన్ శ్రావణిపై అవిశ్వాసం పెట్టేందుకు కొందరు కౌన్సిలర్లు సంతకాల సేకరణ కూడా చేపట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆదివారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శ్రావణికి వ్యతిరేకంగా ఉన్న కొందరు కౌన్సిలర్లు ప్రత్యేకంగా భేటీ కావడం బీఆర్ఎస్ వర్గాల్లో పోటికల్ హీట్ పెంచింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ‌తో పాటు, శ్రావణిని గద్దె దించింతే ఆ స్థానం ఎవరిదనే దానిపై చర్చలు సాగించినట్టుగా సమాచారం.  

అయితే శ్రావణిని వ్యతిరేకిస్తున్న వారిలో కొందరు ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కౌన్సిలర్ల అభిప్రాయాలను తీసుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకోవడంలో భాగంగానే ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇందుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్టుగా సమాచారం.

అయితే శ్రావణిని వ్యతిరేకిస్తున్న కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టే ధైర్యం చేస్తారా? స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతు ఎవరికి ఉంటుంది? అనే అంశాలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న సభ్యులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తి కావాల్సిందే. ఈ నేపథ్యంలో శ్రావణిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇప్పట్లో ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

click me!