ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గురువారం నాడు భేటీ అయ్యారు.
ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో వై.ఎస్. జగన్ కు భారత రాష్ట్ర సమితి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుండి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసానికి చేరుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవెల్లి పాంహౌస్ లో కేసీఆర్ బాత్ రూమ్ లో జారి పడ్డారు. డిసెంబర్ 8వ తేదీన యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. ఈ సర్జరీ జరిగిన తర్వాత కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సర్జరీ తర్వాత కేసీఆర్ ను పరామర్శించేందుకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు.
జగన్ తన నివాసం వద్ద కారు దిగగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తన నివాసంలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జగన్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ చర్చల తర్వాత కేసీఆర్ నివాసంలోనే జగన్ మధ్యాహ్న భోజనం చేస్తారు.భోజనం తర్వాత వై.ఎస్.జగన్ హైద్రాబాద్ నుండి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
ఇవాళే వై.ఎస్. జగన్ సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే రోజున కేసీఆర్ తో వై.ఎస్. జగన్ భేటీ అయ్యారు.