తెలంగాణ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన మరో హామీని కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ ఆర్థిక శాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాన్నే త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లోనూ సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ చూస్తోంది. ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికలకు ముందే ఆరు గ్యారంటీల్లో వీలైనన్ని ఎక్కువ హామీలను నెరవేర్చాలని చూస్తున్నట్లు ప్రభుత్వ పనితీరును బట్టి అర్ధమవుతోంది. ఇలా హామీల అమలుతో తెలంగాణ ప్రజలకు పార్టీపై, ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగేలా చేయాలని... తద్వారా లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితం రాబట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది కాంగ్రెస్. ఆరు గ్యారంటీల్లో ఒకటయిన మహాలక్ష్మి పథకాన్ని అమలుచేసి మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది రేవంత్ సర్కార్. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలోనే భాగమైన మరో హామీని కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెలలోనే అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
undefined
Also Read Prajapalana: ప్రజాపాలనపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకం అమలుపై ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఈ పథకాన్ని ప్రారంభించడం సాధ్యం కాదు... కాబట్టి ఈ నెలలోనే ప్రారంభించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని అమలుచేస్తున్న నేపథ్యంలో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. మహిళలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం అదనంగా ఎంతభారం పడుతుంది? ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ణయించాలి? విధివిధానాలు ఏమిటి? అన్న తదితర అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.