తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండక్కి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. దాదాపు వారం రోజులపాటు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు రానున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు జనవరి 12 నుండి 17 వరకు సెలవులు వుంటాయని తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ ఆదేశాలను పాటించి సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నాయి.
సంక్రాంతి పండగను తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. వీధుల్లో బోగి మంటలు, ఇళ్ళముందు రంగవళ్లులు, గంగిరెద్దులు, హరిదాసులతో సంక్రాంతి మూడురోజులు ఊళ్లలో సందడి మామూలుగా వుండదు. ఉద్యోగాలు, ఉపాధి కోసం దేశ విదేశాల్లో స్థిరపడినవారు సైతం ఈ పండక్కి ఖచ్చితంగా పుట్టిపెరిగిన ప్రాంతానికి వస్తుంటారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపి ఏడాదికి సరిపడా జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు.
మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సంక్రాంతి పండగను ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజుల్లో నిర్వహించే కోడి పందేలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఏపీకి వెళుతుంటారు. ఈ కోడి పందేల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. పోలీస్ ఆంక్షలను పక్కనబెట్టి స్వయంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలే కొడిపందేలు ఆడతారంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అవెంత ప్రత్యేకమో అర్థమవుతుంది. ఇక ఆడపడుచులు రంగురంగుల ముగ్గులతో ఇంటి లోగిలిని అందంగా అలంకరిస్తారు. అలాగే రుచికరమైన పిండివంటలు వుండుకుని ఇంటిళ్ళిపాది ఈ రుచి ఆస్వాధిస్తారు. ఇలా ప్రతిఒక్కరు సంక్రాంతి పండగపూట ఆనందంగా గడుపుతారు.
Also Read తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్ ... ఈ నెల్లోనే మరో హామీ అమలు?
ఏపీ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన సంక్రాంతి పండగకు జగన్ ప్రభుత్వం కూడా సెలవులు ఎక్కువగానే ఇవ్వనుంది. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ వుంది కాబట్టి ఈ మూడురోజులు ఎలాగూ సెలవు ఇవ్వాలి... వీటికి తోడు మరో మూడునాలుగు రోజులు అదనంగా సెలవులు ఇవ్వనున్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై ప్రకటన చేయనుంది.