అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్.. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదన్న మంత్రి

By Sumanth KanukulaFirst Published Feb 4, 2023, 12:39 PM IST
Highlights

తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శనివారం రోజున శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రభుత్వం హామీలు ఇస్తుందని.. కానీ అమలు  చేయడం లేదని విమర్శించారు. పాతబస్తీ మెట్రో సంగతేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేమిటని అడిగారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమను కలవరని అన్నారు. కనీసం చెప్రాసిని చూపిస్తే వాళ్లనైనా కలుస్తామని చెప్పారు. ఇష్టా రీతిలో బీఏసీ లో నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదని అన్నారు.  బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్లకు వెళ్లై టైం ఉంటుంది.. కానీ సభ కు వచ్చేందుకు టైం లేదా అని ప్రశ్నించారు. తాను 25 ఏళ్ళలో ఇలాంటి సభ చూడలేదని అన్నారు. 

అయితే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని అన్నారు. అక్బరుద్దీన్ బీఏసీ సమావేశానికి రాకుండా, ఆయన బాధ్యత నెరవేర్చుకుండా ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. ఆవేశంగా ప్రసంగం చేస్తే సరిపోదు.. అర్థవంతంగా కూడా మాట్లాడొచ్చని అన్నారు. ఎంఐఎంకు 7 గురు సభ్యులు ఉన్నారని.. వారికే అంత సమయం ఇస్తే ఎలా అని అన్నారు. ప్రభుత్వం పని చేయడం లేదని, మంత్రులు అందుబాటులో లేరనడం సరికాదని  అన్నారు. సమయపాలన పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. 

అయితే తాను కొత్త సభ్యుడిని కాదని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. టైమ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసని అన్నారు. రాజ్యంగబద్దంగా  చర్చ జరగాలని కోరారు. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం..ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని అన్నారు. 

శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమకు కోపం రావడం లేదని అక్బరుద్దీన్‌కు కోపం వస్తుందని అన్నారు. ఇంతకుముందు అక్బరుద్దీన్ బాగానే మాట్లాడేవారని అన్నారు. ఈ మధ్య కోపం ఎక్కువ వస్తుందని.. ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై తీర్మానానికి పరిమితం కావాలని కోరారు.  

click me!