కాంగ్రెస్‌లో ఆ నాలుగు స్థానాలకు అభ్యర్ధులెవరు.. వీడని ప్రతిష్టంభన, నియోజకవర్గాల్లోనూ అసమ్మతి

By Siva Kodati  |  First Published Nov 9, 2023, 9:41 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సామాజిక సమీకరణలు, అంగ, అర్ధబలాలు, సర్వేల నివేదికలను సరిచూసుకుని అభ్యర్ధులను ప్రకటించింది. అయితే ఓ నాలుగు స్థానాలకు మాత్రం ఇంత వరకు అభ్యర్ధులు ఎవరనేది ఖరారు చేయలేదు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సామాజిక సమీకరణలు, అంగ, అర్ధబలాలు, సర్వేల నివేదికలను సరిచూసుకుని అభ్యర్ధులను ప్రకటించింది. అయితే ఓ నాలుగు స్థానాలకు మాత్రం ఇంత వరకు అభ్యర్ధులు ఎవరనేది ఖరారు చేయలేదు. రేపటితో నామినేషన్ దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో నేతలు, ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించడంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆయన.. పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించని సర్వేల నివేదికలు తెప్పించుకుని , నాయకుల ఎదుటే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 

Latest Videos

undefined

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే..?

సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్‌కు విధేయులే. వీరిలో ఎవరికి టికెట్ కేటాయించినా.. మరొకరు సహకరించరు. ఇది ఇక్కడ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీస్తుందని నేతలు చెబుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే టికెట్లు కేటాయించిన చోట అసంతృప్తులు పార్టీని చికాకు పెడుతున్నారు. పటాన్ చెరులో నీలం ముదిరాజ్‌ను అభ్యర్ధిగా ప్రకటించగా..  బీఫామ్‌ను ఇవ్వలేదు. ఇక్కడ టికెట్ ఆశించిన కాట శ్రీనివాస్ గౌడ్‌కు మద్ధతుగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, నీలం మధుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచారు. వీరిద్దరూ తమ మాట నెగ్గించుకోవాలని పంతం పట్టడంతో ఇక్కడ డైలామా నెలకొంది. 

ఇక బాన్సువాడలో సీనియర్ నేత బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దుమారం రేపింది. వీటితో పాటు నర్సాపూర్‌లో గాలి అనిల్ కుమార్‌కు బదులుగా రాజిరెడ్డికి టికెట్ కేటాయించారు. కానీ అనిల్ కుమార్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. మహేశ్వరంలో పారిజాత నర్సింహారెడ్డిని కాదని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కు టికెట్ కేటాయించారు. కానీ తనకే టికెట్ ఇవ్వాలని పారిజాత పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరిస్ధితిని చక్కబెట్టేందుకు కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగారు. నామినేషన్స్ దాఖలుకు చివరి రోజు కావడంతో రేపటికి పరిస్థితులు సద్దుమణుగుతాయని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. 

click me!