
మహబూబ్ నగర్ : కన్న బిడ్డలు వున్నా అనాధలుగా బ్రతకాల్సి రావడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు ఇంతకాలం అన్నీ తానై చూసుకున్న భర్త ఇక ఈ బాధలు భరించలేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు.అలనాపాలనా చూసేవారు లేక వృద్ద దంపతులిద్దరూ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
దేవరకద్రకు చెందిన బండ ఆంజనేయులు(65), సత్యమ్మ(58) దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు సంతానం. కూతుళ్లందరికీ పెళ్లిళ్లయి అత్తవారి ఇళ్ళకు వెళ్లారు. పెద్ద కొడుకుకు కూడా పెళ్ళికాగా వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ లో నివాసముంటున్నారు. చిన్నకొడుకుకు పెళ్లి కాకున్నా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్ లోనే వుంటున్నాడు. ఇలా పిల్లలందరూ దూరంగా వుండటంతో వృద్ద దంపతులు ఇద్దరే దేవరకద్రలో వుంటున్నారు.
Read More నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి సూసైడ్
మూడేళ్ళ క్రితం సత్యమ్మకు పక్షపాతం రావడంతో మంచానపడింది. అయినప్పటికి కొడుకులు, కూతుళ్లు వారి వద్ద వుండకపోవడంతో ఆంజనేయులే భార్యకు సపర్యలు చేస్తూ వచ్చాడు.ఇలా కొడుకులు, కూతుళ్లు వున్నా అనాధలుగా బ్రతకాల్సిన వస్తుండటం ఆ దంపతులు తీవ్రంగా కలచివేసింది. ఇలా ఇంతకాలం తీవ్ర మనోవేదనకు గురయిన వృద్ద దంపతులు దారుణ నిర్ణయం తీసుకున్నారు.
గురువారం తెల్లవారుజామున దంపతులిద్దరూ తాముండే ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం ఎంతకూ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల ఇళ్లవారు తెరిచిచూడగా దంపతుల మృతదేహాలు ఉరితాడుకు వేలాడుతూ కనిపించాయి. దీంతో వెంటనే స్థానికులు వారి పిల్లలకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.
(ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు)