కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ తర్వాత ఏర్పాటైందని, ఆ తేదీ తర్వాత పెళ్లి చేసుకున్నవారికి తాము ప్రకటించినట్టుగా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మీ పథకంపై అనిశ్చితి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు తోడు.. తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, కళ్యాణ లక్ష్మీ డబ్బులతోపాటు తులం బంగారం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయంపై అస్పష్టత నెలకొంది. దీనిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా స్పష్టత ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి వచ్చిందని, డిసెంబర్ 7 తర్వాత పెళ్లి చేసుకున్న వారికి కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ. 1 లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నదని తెలిపారు. విద్యార్థులకు ప్రకటించిన విద్యా భరోసా సైతం రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు.
Also Read: Free Bus: ఏపీ ఎన్నికలపై ‘మహిళలకు ఉచిత ప్రయాణం’ ప్రభావం ఎంత?
జగిత్యాల రూరల్ మండలం పొలాసలో నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో స్వీకరిస్తున్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి ఫిబ్రవరి నుంచే పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వివరించారు.