ఖమ్మం నుండి పోటీ చేయాలని సోనియా గాంధీని కోరినట్టుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు.
ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పోటీ చేయాలని కోరినట్టుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు.గురువారంనాడు ఖమ్మంలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నుండి సోనియా గాంధీ పోటీ చేయకపోతే తానే ఈ స్థానం నుండి పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి గతంలో రేణుకా చౌదరి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ దఫా కూడ ఆమె ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే సోనియా గాంధీ పోటీ చేయనని ప్రకటిస్తే తానే రంగంలోకి దిగుతానని చెప్పారు.
రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చినందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు.
ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి రేణుకా చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు తాను ఉత్తర భారత దేశంలో పర్యటించిన విషయాన్ని రేణుకా చౌదరి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు బహిరంగంగానే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. ఉమ్మడి ఖమ్మంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.