అదనపు కట్నంవేధింపులు మరో వివాహితను బలి తీసుకున్నాయి. విజయనగరానికి చెందిన వివాహిత హైదరాబాద్ గచ్చిబౌలిలోని తాముంటున్న అపార్ట్ మెంట్లో విగతజీవిగా కనిపించింది.
హైదరాబాద్ : హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం, కొండకరకం గ్రామానికి చెందిన జి. సునీత (23)కు ప్రైవేట్ బ్యాంకుల్లో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న అదే ప్రాంతానికి చెందిన ఆర్ రమేష్ 2019 మే 17న వివాహం అయ్యింది. అతనికి హైదరాబాద్ కు బదిలీ కావడంతో గచ్చిబౌలి సుదర్శన్ నగర్ లోని మెజిస్టిక్ ప్లజెంట్ హోమ్స్ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చే సరికి పడకగదిలో సునీత ఉరి వేసుకుని, వేలాడుతూ కనిపించింది.
ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, వివాహ సమయంలో 5 కిలోల బంగారం, 14 లక్షల నగదు, 20 సెంట్ల భూమి కట్నంగా ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం అల్లుడు, అతని తల్లిదండ్రులు తమ కుమార్తెను, శారీరకంగా, మానసికంగా వేధించారని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు కొనుగోలుకు అదనంగా 10 లక్షలు తీసుకురావాలంటూ నెలరోజులుగా అత్తింటివారి వేధింపులు ఎక్కువవడంతో సునీత ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త అతని కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
undefined
మాజీమంత్రి అనిల్ కూ తప్పని రుణయాప్ ల వేధింపులు.. ఫోన్లోనే వాగ్వాదం..
కాగా, విజయనగరంలోని కేఎల్ పురం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి శుక్రవారం సాయంత్రం జొన్నవలస రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలో బ్యాంగిల్ స్టోర్ నడుపుతున్న లెంక సత్యనారాయణ, నరసమ్మ దంపతుల రెండో కుమారుడు నరేంద్ర కుమార్ (22) డిగ్రీ చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన నరేంద్ర మృతిపై.. తల్లిదండ్రులు స్నేహితులు తల్లడిల్లిపోతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య? సాధారణ మరణమా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా విజయనగరంలోని వీరఘట్టంలో బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కుమారుడు.. చెప్పినట్లు వినడం లేదని ఆవేదనతో.. ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరఘట్టంలోని కూరాకుల వీధిలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొందూరు పార్వతి, శ్రీను దంపతులకు16 ఏళ్ళ వయసున్న మురళి అనే కుమారుడు ఉన్నాడు. ఇంత వయస్సు వచ్చినా తమ బిడ్డ అందరిలాగా చదువుకోవడం లేదని, తెలివిగా వ్యవహరించడం లేదని పార్వతి ఆవేదనకు గురయ్యేది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగింది. ఆమె భర్త వెంటనే గుర్తించి వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం అందించేందుకు 108 వాహనంలో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే కుటుంబ సభ్యులు తెలిపారు.