వరంగల్ మెడికో ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ హైద్రాబాద్ డీఎంఈ కార్యాలయం ముందు విద్యార్ధి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.
హైదరాబాద్: వరంగల్ మెడికో ప్రీతికి న్యాయం చేయాలని కోరుతూ హైద్రాబాద్ డీఎంఈ కార్యాలయం ముందు ఏబీవీపీ శ్రేణులు గురువారంనాడు ఆందోళనకు దిగాయి. వరంగల్ లో కూడా విద్యార్ధి సంఘాలు ఈ విషయమై ఆందోళన చేపట్టాయి.
వరంగల్ కేఎంసీ లో మెడికో ప్రీతి నిన్న ఆత్మహత్యాయత్నం చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై అంతర్గతంగా విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రకటించారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకుందా ఇతరత్రా కారణాలు ఇందుకు కారణమా అనే విషయమై ఈ కమిటీ విచారణ జరపనుందని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
సీనియర్ సైఫ్ చాలా కాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడని మెడికో ప్రీతి తండ్రి నరేందర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాము ప్రిన్సిపల్ దృష్టికి కూడ తీసుకెళ్లినట్టుగా నరేందర్ చెబుతున్నారు. మెడికో ప్రీతికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఎంజీఎం నుండి హైద్రాబాద్ నిమ్స్ కి తరలించారు. డాక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇవాళ నిమ్స్ లో ప్రీతి కుటుంబసభ్యులను డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి పరామర్శించారు. ప్రీతికి అందుతున్న వైద్య గురించి ఆరా తీశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నంపై విచారణ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
also read:ఎంబీబీఎస్‌లోనే ర్యాగింగ్, పీజీలో ఉండదు: మెడికో ప్రీతి ఆరోగ్యంపై డీఎంఈ ఆరా
మెడికో ప్రీతిపై వేధింపులకు దిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు విచారిస్తున్నారు. ప్రీతి, సైఫ్ మధ్య ఎలాంటి గొడవలు జరిగాయనే విషయమై ఆరా తీస్తున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడానికి రెండు రోజుల ముందే వీరిద్దరికి కేఎంసీ ప్రిన్సిపల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. డాక్టర్ ప్రీతి విషయంలో ఏం జరిగిందో పోలీసులు , కేఎంసీ సీనియర్ ప్రొఫెసర్ల కమిటీ వేర్వేరుగా విచారణ నిర్వహిస్తుంది. ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.