
కాంగ్రెస్ నేత, ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నల్లెల కుమారస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుమారస్వామి గురువారం ఉదయం మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న కుమారస్వామి.. ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో కుమారస్వామి కన్నుమూశారు. కుమారస్వామి మృతితో ఆయన కుటుంబంతో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కుమారస్వామి మృతిపై ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీతక్క.. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. కుమారస్వామికి నివాళులర్పించే సమయంలో సీతక్క కూడా కన్నీరు పెట్టుకున్నారు. కుమారస్వామికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన సీతక్క.. ఆయన తనకు సోదరుడి కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే వారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవారని తెలిపారు. క్యాన్సర్‌తో పోరాడాని.. అయితే ములుగు డీసీసీ అధ్యక్షుడిగా ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారని అన్నారు. ములుగు తన అన్నను కోల్పోయిందని భావోద్వేగానికి గురయ్యారు.
కుమారస్వామి మృతిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుమారస్వామి అకాలమరణం కలచివేసింది. క్షేత్ర స్థాయి కార్యకర్త నుంచి డీసీసీ స్థాయికి ఎదిగిన స్వామి లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.