
జిఎస్టీ అంటే ఇంతకాలం ఎవరికీ అంతుచిక్కలేదు. అదొక బ్రహ్మ పదార్థం అనుకున్నారు. దాంతోటి ఏం కాదులే మస్తుగ ధరలు దిగివస్తయి. మనకు మస్తు లాభం అని కాశాయ దళాలు తీపి మాటలు చెప్పినయి. తీరా ఇయ్యాల పొద్టున మొదలైంది వినియోగదారులకు జిఎస్టీ మోత. తెలంగాణ, కర్ణాటక, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిఎస్టీ బిల్లుల మోత ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.
ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే బిల్లు ఇదే జిఎస్టీ అంటే అని ఇంతకాలం ఊదరగొట్టారు పాలకులు. కానీ ఇప్పుడు ఒకేదేశం నిజమే, ఒకే ప్రజ నిజమే కానీ బిల్లులు రెండు అని జిఎస్టీ అమలు నిరూపిస్తోంది.
జిఎస్టీ వల్ల ధరలు తగ్గే వస్తువుల సంఖ్య చేంతాడంత ఉంది అంటూ పాలకపక్షం సోషల్ మీడియాలో ఊదరగొట్టింది. కానీ అమలు మొదలైన వెంటనే అసలు గుట్టు రట్టు అయింది. జిఎస్టీ ద్వారా కేంద్రం, రాష్ట్రాలు చెరో 9 శాతం పన్నులు బాది ఖజానా నింపుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు కేవలం సెంట్రల్ జిఎస్టీ మాత్రమే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ సెంట్రల్ జిఎస్టీ 9శాతం, రాష్ట్ర జిఎసట్ 9 శాతం అని బిల్లులో వేరువేరుగా పన్ను వేస్తున్నారు. ఒకే పన్ను అనుకుంటే ఇలా ఇద్దరూ కలిసి వేస్తున్నారేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
అయితే నిపుణులు మాత్రం ఇద్దరు బిల్లులేసినా వారిద్దరి శాతం 18కి మించడంలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. అయినా రెండురకాల బిల్లులు కలిపే ఇవ్వకుండా ఇలా స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని ఎందుకిస్తున్నారో అర్థం కావడంలేదని నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో యుటి జిఎస్టీ అని బిల్లులో వెల్లడిస్తున్నారు.