ఆటోతో ఢీకొట్టి, గాయపడిన వ్యక్తిని డంపింగ్ యార్డులో పడేసి...

By telugu teamFirst Published Mar 10, 2021, 8:57 AM IST
Highlights

హైదరాబాదులోని మియాపూర్ లో జరిగి ఓ అమానుష సంఘటన రెండు నెలల తర్వాత వెలుగు చూసింది. ఓ ఆటో డ్రైవర్ రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టి, అతన్ని డంపింగ్ యార్డులో పడేశాడు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రెండు నెలల క్రితం జరిగిన ఓ అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుస్తున్న ఓ వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. గాయపడిన అతన్ని ఆటో డ్రైవర్ డంపింగ్ యార్డులో పడేశాడు. దీంతో గాయపడిన వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆటో డ్రైవర్ అమానుషత్వం వెలుగు చూసింది.

ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మియాపూర్ జనప్రియ నగర్ కు చెందిన కాకర రామకృష్ణ జనవరి 7వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మియాపూర్ రత్నదీప్ మార్కెట్ వద్ద ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు రోడ్డు దాటుతున్నాడు. 

హఫీజ్ పేటకు చెందిన సయ్యద్ షేర్ అలీ (38) తన మిత్రుడు గౌస్ కు చెందిన ఆటోను తీసుకుని ఆ ఆటోతో రామకృష్ణను ఢీకొట్టాడు. దాంతో రామకృష్ణ గాయపడి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు గుర్తించి రామకృష్ణను అదే ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని సయ్యద్ షేర్ అలీకి చెప్పారు.

అలాగేనని చెప్పి రామకృష్ణను ఎక్కించుకున్న షేర్ అలీ కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతన్ని ఖైత్లాపూర్ లోని డంపింగ్ యార్డులో పడేసి వెళ్లిపోయాడు. రామకృష్ణ వ్దద ఉన్న సెల్ ఫోన్ తో పాటు రూ.3 వేల నగదును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. 

రామకృష్ణ తిరిగి ఇంటికి రాకపోవడంతో అదే నెల 8వ తేీదన కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఖైత్లాపూర్ జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డులో గుర్తు తెలియని శవం ఉందని అదే రోజు సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రామకృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించి శవాన్ని చూపించారు. వారు దాన్ని రామకృష్ణ మృతదేహంగా గుర్తించారు. 

మృతదేహం మీద గాయాలు కనిపించడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగించారు ఈ క్రమంలో రామకృష్ణను ఆటో ఢీకొట్టిన విషయాన్ని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు దాంతో పాటు రామకృష్ణ సెల్ ఫోన్ ను ఆటో డ్రైవర్ లతీఫ్ అనే వ్యక్తికి రూ.1000కి అమ్మినట్లు తెలుసుకున్నారు. లతీఫ్ ను విచారించగా నిందితుడు ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్ అలీ అని తేలింది. 

మంగళవారంనాడు పోలీసులు సయ్యద్ షేర్ అలీని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను నేరాన్ని అంగీకరించాడు.

click me!